పెన్నమ్మ గర్భంలో శివక్షేత్రం

Lord Shiva Temple Found in Penna River SPSR Nellore - Sakshi

ఏడు దశాబ్దాల క్రితం ఇసుక మేటల్లో పూడిపోయిన ఆలయం

తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లు

200 ఏళ్ల క్రితం నిర్మించారని ప్రచారం  

నెల్లూరు, ఆత్మకూరు: పెన్నానది తీరాన ఇసుక మేటలో పూడిపోయిన శివాలయం తవ్వకాల్లో బయటపడింది. ఈ సంఘటన చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు (పిరమనపాడు) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పెన్నా తీరాన నాగేశ్వరాలయం ఉండేది. ఇక్కడ విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించారని చెబుతుంటారు. 200 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. నిత్యం పూజలు జరుగుతుండేవి. మహా శివరాత్రి, నాగుల పంచమి పర్వదినాల్లో ఉత్సవాలు, విశేష పూజలు నిర్వహించేవారని తమ పూర్వీకులు తెలిపినట్లు వృద్ధులు వెల్లడించారు. 70 ఏళ్ల క్రితం పెన్నానదికి వరదలు ఉధృతంగా రాగా ఇసుకమేటల కారణంగా క్రమేపీ ఆలయం భూమిలో పూడిపోయింది. ఇసుక కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామాన్ని నదికి రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించుకున్నారు. కాలక్రమేణా ఆలయం పూర్తిగా పూడుకుపోయి ఆనవాళ్లే కనిపించలేదు.

ఇలా వెలుగులోకి..
ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానిక యువకులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. ఇటీవల ఓ రోజు రచ్చబండపై కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా వృద్ధులు ఆలయం గురించి చెప్పారు. నూతనంగా అనుమతులు లభించిన ఇసుక రీచ్‌కు సమీపంలో ఆలయం ఉండొచ్చని చెప్పగా యువకులు రీచ్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాసచౌదరి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జేసీబీ, హిటాచీ యంత్రాలను ఇచ్చి సహకరించారు. దీంతో మంగళవారం ఉదయం యువకుల నేతృత్వంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. శిఖరం, గర్భగుడి, ముఖ మండపాలు వెలుగులోకి వచ్చాయి. శిఖరంపై చెక్కిన అందమైన దేవతామూర్తుల ప్రతిమలు కొంతమేర దెబ్బతిన్నాయి. శివాలయం బయట పడడంతో గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని కొబ్బరికాయలు కొట్టారు. తహసీల్దార్‌ గీతావాణి, వైఎస్సార్‌సీపీ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పార్థసారథి, గణేష్‌ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పురావస్తు శాఖ అనుమతులు తీసుకుని దాతల సహకారంతో ఆలయాన్ని పునః నిర్మించేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపారు.

పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి  
మా గ్రామంలోని పెద్దలు పెన్నానది ఒడ్డున శివాలయం ఉండేదని చెప్పేవారు. ఇటీవల గ్రామానికి చేరిన యువకులు పలువురి సహకారంతో తవ్వకాలు చేశారు. ఆలయాన్ని పునః నిర్మించేందుకు మంత్రి గౌతమ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తా.– కె.శ్రీధర్, పెరుమాళ్లపాడు

ఉత్సవాలు బాగా చేసేవారు
మా తాత విశ్వనాథం సీతారామయ్య పిరమనపాడు (పెరుమాళ్లపాడు)లోని నాగేశ్వరాలయంలో పూజారిగా ఉండేవారు. నా చిన్నతనంలో ఆయనతో కలిసి ఆత్మకూరు నుంచి ఆలయానికి వెళుతుండేదాన్ని. పెన్నా నదికి వరదలు వచ్చిన సమయంలో గ్రామంలోనే ఉండిపోయేవారు. వర్షాకాలంలో వరదల ఉధృతికి ఆలయంలో బురద సైతం చేరేది. అది పెద్ద ఆలయం. ఉత్సవాలు బాగా చేసేవారు.– విశ్వనాథం సుశీలమ్మ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top