
రుణమాఫీపై చిత్తశుద్ధి ఏదీ?
టీడీపీ అధికారంలోకి రావటానికి కారణమైన అంశాలలో రుణమాఫీపై ప్రభుత్వం అనుసరిస్తున్న దోరణి ....
► ప్రభుత్వ తీరుతో రైతుకు ప్రాణ సంకటం
► విడుదల కాని రెండవ విడత నిధులు
► ఎదురు చూస్తున్న లక్షలాది మంది
కొరిటెపాడు (గుంటూరు): టీడీపీ అధికారంలోకి రావటానికి కారణమైన అంశాలలో రుణమాఫీపై ప్రభుత్వం అనుసరిస్తున్న దోరణి రైతులకు ప్రాణ సంకటంగా మారింది. ఒకపక్క రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం రుణమాఫీకి చెల్లించాల్సిన నిధులు విడతలవారీగా చెల్లిస్తామని చెప్పి మొదటి విడత మాత్రమే విడుదల చేసింది. రెండవ విడత నిధులు తొలత ప్రకటించిన ప్రకారం 2016 జనవరి మొదటి వారంలో నిధులు విడుదల చేయాల్సి ఉండగా మార్చి రెండో వారం ముగుస్తున్నా విడుదల చేయలేదు. తొలుత గత ఏడాది మొదటి, రెండవ జాబితాలలో ఎంపిక చేసిన రైతులకు రూ.50 వేల లోపు ఉన్న వారికి మొత్తం రుణాన్ని మాఫీ చేశారు.
రూ.50 వేలకు మించి ఉన్న రైతులకు రూ.1.50 లక్షల వరకూ ఐదు విడతలుగా రుణం మొత్తం చెల్లిస్తామని ప్రకటించారు. గుంటూరు జిల్లాలో రైతులకు మొత్తం రూ.3 వేల కోట్ల పైచిలుకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. తొలివిడత 5,74,677 మంది రైతులకు రూ.912.41 కోట్లు జమ చేశారు. రెండవ విడత సుమారు రూ.800 కోట్లు జనవరి మొదటి వారం లోపు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రాజధాని రైతులకు ఒకే పర్యాయం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వారి రుణాలను కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు. ఇప్పటికీ కొందరు రైతులు సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
బహిరంగ వేదికల్లో మాత్రం ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నడూ లేనివిధంగా రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈ మొత్తంలో 20 శాతం మాత్రమే ఇప్పటి వరకు(తొలివిడతలో) రైతులకు అందజేశారు. వర్షాభావం కారణంగా ఈ ఏడాది పంటలు సక్రమంగా పండక రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల కోసం అర్రులు చాస్తున్నారు. వారికి అప్పులు ఇచ్చేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రాకపోగా ఇటీవల పంటలకు వచ్చిన కాస్త డబ్బు తమ బకాయిలకు జమ చేయాలని పీకలమీద కుర్చుంటున్నారు. చేసేదేమీ లేక రైతులు ఆ మొత్తాన్ని వడ్డీ వ్యాపారులకు జమ చేసి జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది. కొత్త అప్పులు పుట్టక రైతులు సతమతమవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు.
తుది జాబితా ఎప్పుడు?
రుణమాఫీ రెండు విడతల జాబితాలలో వివిధ కారణాలతో అనేక మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అర్హత ఉన్నవారు మరోమారు దరఖాస్తులను అందజేయాలని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించడంతో వేలాది మంది రైతులురాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయానికి అర్జీలు పంపారు. తుది జాబితా ప్రకటించే విషయంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
వడ్డీకే సరిపోలేదు...
రుణమాఫీకి మొదటి విడతగా విడుదల చేసిన రూ.30 వేలు వడ్డీకి కూడా జమకాలేదు. నాకు రూ.1.50 లక్షలు మాఫీ అయిందని అధికారులు తెలిపారు. మొదటి విడతగా రూ.30 వేలు జమచేశారు. రెండో విడత 2016-జనవరి మొదటి వారంలో జమ చేస్తామని చెప్పారు. ఇంత వరకు జమకాలేదు. బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వక, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అప్పులు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. -మురుకొట్ల పూర్ణచంద్రరావు, వింజనంపాడు, వట్టిచెరుకూరు మండలం
వడ్డీ వ్యాపారుల ఒత్తిడి..
అప్పులు ఇచ్చేం దుకు వ్యాపారులు ముం దుకురాకపోగా ఇటీవల పంటలకు వచ్చిన కాస్త డబ్బు పాత బకాయిలకు జమచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రెండవ విడత రుణమాఫీ డబ్బును ఖాతాలకు జమచేయాలి. -అవుతు సుబ్బారెడ్డి, గారపాడు, వట్టిచెరుకూరు మండలం