క్షమాభిక్ష కోసం ఎదురుచూపు | Sakshi
Sakshi News home page

క్షమాభిక్ష కోసం ఎదురుచూపు

Published Wed, Jan 23 2019 1:23 PM

Life Time Prisoners Waiting For Clemency Anatnapur - Sakshi

క్షణికావేశంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఎంతో మంది ఖెదీలు జైళ్లలో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు, భార్యా, బిడ్డలకు దూరమై మానసిక ఆవేదన చెందుతున్నారు. జీవిత ఖైదీలలో అర్హులైన వారికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి క్షమాభిక్ష ద్వారా విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఖైదీలకు క్షమా భిక్ష జీఓ విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. రెడ్డిపల్లి ఓపన్‌ ఎయిర్‌ జైలులో మొత్తం 52 మంది ఖైదీలున్నారు. ఇందులో ఏడేళ్ల శిక్షతో పాటు మూడేళ్ల రెమిషన్‌ కలిపి మొత్తం పదేళ్ల శిక్ష అనుభవించిన 31 మంది ఖైదీలు క్షమాభిక్ష జీఓ వస్తే విడుదలయ్యేందుకు ఎదురుచూస్తున్నారు.

అనంతపురం, బుక్కరాయసముద్రం:  జీవిత ఖైదీల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న జీఓ 6 ప్రకారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఏడేళ్ల శిక్షతో పాటు మూడేళ్ల రెమిషన్‌ కలిగిన వారు క్షమాభిక్షకు అర్హులు. 65 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఐదేళ్ల శిక్షతో పాటు రెండేళ్ల రెమిషన్‌ కలిగి ఉండాలి. మహిళలు అయితే ఐదేళ్ల శిక్షతో పాటు రెండేళ్ల రెమిషన్‌ కలిగి ఉండాలి. పురుషులు ఫ్యామిలీ కేసులు అయితే 14 సంవత్సరాల శిక్షతో పాటు 6 సంవత్సరాల రెమిషన్‌ కలిగి ఉండాలి. మహిళలు అయితే పది సంవత్సరాల శిక్షతో పాటు నాలుగు సంవత్సరాల రెమిషన్‌ కలిగి ఉండాలి. స్వలాభం కోసం హత్య చేసిన వారు సెక్షన్‌ 379 నుంచి 402 సెక్షన్‌ వరకు కేసులు ఉన్నవారు 14 సంవత్సరాలు శిక్షతో పాటు 6 సంవత్సరాల రెమిషన్‌ కలిగి ఉండాలి. 

క్షమాభిక్షకు అనర్హతలు ఇవే..
విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులను చంపిన వారు క్షమాభిక్షకు అనర్హులు. 16 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న బాలురను చంపడం, 18 సంత్సరాల లోపు ఉన్న బాలికలను చంపిన వారు కూడా అనర్హులే. కిడ్నాప్, రేప్‌కేసులో శిక్ష అనుభవిస్తున్న వారికీ క్షమాభిక్ష లేదు. జైలులో క్రమ శిక్షణ ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు విడుదలకు అవకాశం ఉండదు. గంజాయి కేసులో జీవిత ఖైదు పడిన వారు అనర్హులు. తీవ్రవాదులకు క్షమాభిక్ష వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల వల్ల 17 మంది జీవిత ఖైదీలు క్షమాభిక్షకు దూరమవుతున్నారు.  

12 సంత్సరాలు శిక్ష పూర్తి చేసినా..
ఈ వ్యక్తి ప్రకాశం జిల్లా కందుకూరు మండలానికి చెందిన రామస్వామి. భార్యను చంపిన కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మొదట్లో రామస్వామికి పోలీస్‌ స్టేషన్‌లో 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. భార్య మూడు నెలలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో పోలీసులు తిరిగి 302, 498–ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏడు సంవత్సరాల శిక్షతో పాటు మూడు సంవత్సరాల రెమిషన్‌ పూర్తి చేసుకున్నవారు క్షమాభిక్షకు అర్హులని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే తాను 12 సంవత్సరాలు శిక్ష పూర్తి చేసుకున్నానని రామస్వామి చెబుతున్నాడు. మార్గదర్శకాల నిబంధనల వల్ల తాను క్షమాభిక్షకు నోచుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకూ క్షమాభిక్ష ప్రసాదించి ఉంటే పిల్లల వద్దకు చేరుకునేవాడినని వాపోయాడు.

అర్హుల జాబితాను సిద్ధం చేశాం
ఓపెన్‌ ఎయిర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్షకు అర్హులైన వారి జాబితా సిద్ధం చేసుకుని రాష్ట్ర జైళ్లశాఖ డీఐజీ కార్యాలయానికి పంపించాము. జీవిత ఖైదీల విడుదల ప్రభుత్వం చేతుల్లో ఉంది. జీఓ సంబంధించి ఫైలును జైళ్లశాఖ నుంచి  కేబినెట్‌కు, అక్కడ నుంచి గవర్నర్‌కు, సీఎంకు వెళ్తుంది. అక్కడ నుంచి విడుదలకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంటుంది.
– సుదర్శన్, ఇన్‌చార్జి సూపరింటెండెంట్, ఓపెన్‌ ఎయిర్‌ జైలు, రెడ్డిపల్లి, బుక్కరాయసముద్రం మండలం 

Advertisement

తప్పక చదవండి

Advertisement