యువరానర్‌..కాదు కాదు.. అధ్యక్షా..!

Lawyers Entered Politics And Embraced The Best Of The State and National Politics - Sakshi

సాక్షి, గుంటూరు: న్యాయ శాస్త్రం చదివి కోర్టులో కేసులు వాదించాల్సిన జిల్లాకు చెందిన అనేక మంది  న్యాయవాదులు రాజకీయాల్లో ప్రవేశించి చక్కగా రాణిస్తూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తమదైన గుర్తింపు పొందారు. జిల్లాకు చెందిన సుమారు 20 మంది న్యాయవాదులు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పదవులు అలంకరించి జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. 20 మందిలో ఏడుగురు ఎంపీలుగా గెలిచారు. వీరిలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మిగతా 14 మంది ఎమ్మెల్యేలుగా... వీరిలో కొందరు రాష్ట్ర    మంత్రులుగా కూడా పని చేశారు. 

- నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి లా చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ మొట్టమొదటిసారిగా ఫిరంగిపురం నుంచి ఎమ్మెల్యేగా రెండు దఫాలు ఎన్నికయ్యారు. అనంతరం నరసరావుపేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఈయన కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత స్థానమైన ఏఐసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

- బాపట్ల నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఈయన న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే.

- మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు కూడా గురజాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి 2004, 2009 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైఎస్సార్‌ క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు. 

- టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు. 

- దుగ్గిరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అనంతరం మంత్రిగా పనిచేసిన ఆలపాటి ధర్మారావు సైతం న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. 
-  వేమూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా యడ్లపాటి వెంకట్రావు మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. ఈయనా న్యాయవాద వృత్తి నుంచి వచ్చినవారే. 

- బాపట్ల నియోజకవర్గానికి చెందిన కోన ప్రభాకరరావు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రమంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. 
-  కొత్త రఘురామయ్య గుంటూరులో న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. 

-  సలగల బెంజిమెన్, సింగం బసవపున్నయ్య, ఎస్‌.వి.ఎల్‌.నరసింహారావు, ముప్పలనేని శేషగిరిరావు, నిశ్శంకరరావు వెంకటరత్నం, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి న్యాయవాద వృత్తి నుంచి ఎంపీలుగా గెలుపొంది నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యాన్ని కనబర్చారు. 

-  జిల్లాకు చెందిన గాదె వీరాంజనేయశర్మ, గంగినేని వెంకటేశ్వరరావు, నల్లపాటి వెంకటరామయ్య, అంబటి రాంబాబు, నక్కా ఆనందబాబు, మర్రి రాజశేఖర్‌ కూడా న్యాయవాదులుగా కొనసాగుతూ రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top