భయపడే భూములిచ్చాం | lands | Sakshi
Sakshi News home page

భయపడే భూములిచ్చాం

Mar 12 2015 1:46 AM | Updated on Aug 10 2018 5:38 PM

తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు భయపడి తమ భూములు ఇచ్చామని ఏక్తా పరిషత్ చైర్మన్, అన్నా ప్రతినిధి పి.వి.రాజగోపాల్ ఎదుట రాజధాని ప్రాంత రైతులు వాపోయారు.

ఏక్తా పరిషత్ చైర్మన్, అన్నా ప్రతినిధి పి.వి.రాజగోపాల్ ఆధ్వర్యంలోని బృందం బుధవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి నేరుగా రైతులతో మాట్లాడింది. ప్రభుత్వ పాలకులు, అధికారులకు భయపడే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినట్టు ఈ సందర్భంగా బృందం ఎదుట రైతులు వాపోయారు.      
 
 తాడికొండ   :  తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు భయపడి తమ భూములు ఇచ్చామని ఏక్తా పరిషత్ చైర్మన్, అన్నా ప్రతినిధి పి.వి.రాజగోపాల్ ఎదుట రాజధాని ప్రాంత రైతులు వాపోయారు. రాజధాని ప్రాంతంలో రైతుల వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కొంటున్నారని తెలుసుకున్న రాజగోపాల్‌తో కూడిన అన్నాహజారే మిత్ర బృందం బుధవారం ఆయా గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసింది. తుళ్లూరు మండలం మందడం, తాళాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు, మనోభావాలు తెలుసుకుంది. రైతుల తరఫున పోరాడతామని వారికి భరోసానిచ్చింది. అంతకుముందు తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో పర్యటించి రైతాంగ సమస్యలను అడిగితెలుసుకున్నారు.  ఈ సందర్భంగా రాజగోపాల్ లింగాయపాలెం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ, బలవంతం చేయడం వల్లే భూములు ఇచ్చినట్లయితే రైతులు వాటిని వెనక్కు తీసుకోవచ్చని,  ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే తాము రైతుల తరఫున పోరాడతామని చెప్పారు. రాజధాని ప్రాంత సమస్యలను ఢిల్లీలో అన్నాహజారే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
 
 
 రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను తీసుకోవడం న్యాయం కాదన్నారు. అనంతరం రాజధాని పర్యటన కమిటీ నాయకులు లింగాయపాలెం గ్రామానికి చెందిన అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన రాజధాని ప్రాంత రైతుల తరఫున ఢిల్లీలో నిర్వహించిన సేవాగ్రామ్ కార్యక్రమానికి వెళ్లి రాజధాని ప్రాంత పరిస్థితిపై సామాజిక ఉద్యమనేత అన్నాహజారేకు వివరించినట్లు చెప్పారు.  
 
 
 ఈనెలాఖరులో అన్నాహజారే 1100 కిలో మీటర్ల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతాన్ని సందర్శించే అవకాాశం ఉందన్నారు. అదేవిధంగా కొద్దిరోజుల్లో రాజధాని ప్రాంతాన్ని సందర్శించడానికి మేధాపాట్కర్ కూడా రానున్నట్లు చెప్పారు. అనంతరం రాయపూడిలోని నిమ్మతోటలను పంట పొలాలను బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో బృందం ప్రతినిధి బలిశెట్టి సత్యనారాయణ, విష్ణు, ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు, చిట్టిబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement