ఎదురుదెబ్బ! | Labor unions Strike notice on rtpp ce attitude | Sakshi
Sakshi News home page

ఎదురుదెబ్బ!

Dec 23 2014 2:10 AM | Updated on Aug 10 2018 9:42 PM

అధికారం అనే శిఖండిని అడ్డుపెట్టుకుని కార్మికులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు తగిలింది.

సాక్షి ప్రతినిధి, కడప: అధికారం అనే శిఖండిని అడ్డుపెట్టుకుని కార్మికులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు తగిలింది. ఆర్టీపీపీలో కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యానికి అనుగుణంగా అడుగులేస్తున్న పోట్లదుర్తి బ్రదర్స్ నిర్ణయాల్ని ప్రతిఘటించారు. అధికార పార్టీ నిర్ణయాలు అమలు చేస్తున్న ఆర్టీపీపీ సీఈ వైఖరిని నిరసిస్తూ కార్మిక యూనియన్లు ఏకమయ్యాయి. వెరసి సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మికుల సమ్మెను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించారు.. కార్మికుల పొట్టకొట్టి లబ్ధిపొందాలనే లక్ష్యంతో శల్యసారధ్యం చేపట్టారు. ఆర్టీపీపీలో భూనిర్వాసితుల్ని కాదని అనుచరుల్ని చేర్పించుకునే లక్ష్యంతో తెలుగుదేశం నేతలు పావులు కదిపారు.

అందులో భాగంగా కార్మికులు న్యాయమైన డిమాండ్లను కాదని, యాజమాన్యానికి ఒత్తాసుగా నిలిచారు. 1200 మంది కార్మికులు ఏకతాటిపై నిలిచి ఆందోళనకు సిద్ధమైతే వ్యూహాత్మకంగా యాజమాన్యంతో చేతులు కలిపి ఉద్యమాన్ని నీరుగార్చారు. అర్ధరాత్రి విధుల్లోకి అనుచరగణాన్ని తీసుకువచ్చి కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈమొత్తం వ్యవహారంలో పోట్లదుర్తి బ్రదర్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పావులు కదుపుతూ వచ్చారు. వారి చర్యలను కార్మిక యూనియన్లు ప్రతిఘటించాయి. ఆర్టీపీపీకి సమ్మె నోటీసు జారీ చేసి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని పరోక్ష ంగా హెచ్చరించారు.
 
కడపు మండడంతోనే ఆందోళన...
ఆర్టీపీపీ ఇంజనీరింగ్ అధికారులు ఇతర ఉద్యోగుల జీతాలు 30 శాతం పెంచుకుంటూ జిఓ నెంబర్ 34 జారీ చేశారు. అదే సమయంలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, వారి జీతభత్యాలు, స్థితిగతులపై అధ్యయనం చేయాలని జిఓ నెంబర్ 35 జారీ చేశారు. ఆమేరకు డెరైక్టర్ స్థాయి అధికారులతో కూడిన నలుగురు గల సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఆ కమిటీ జూలై చివరకు యాజమాన్యానికి  నివేదిక అందజేయాల్సి ఉంది. అంటే దాదాపు 5నెలల క్రితం కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులపై నివేదిక అందించాల్సి ఉంది. ఇవేవి పట్టించుకోకుండా కార్మికుల పొట్టకొట్టే చర్యల్లోనే నిమగ్నం కావడంతో ఆర్టీపీపీ కార్మికులు ఏకకాలంలో 1200 మంది ధర్నా చేపట్టారు. సీఈ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కారించాల్సింది పోయి రాజకీయాల్ని చొప్పించారు.

తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అయి బయటి నుంచి 150మంది కార్మికుల్ని అనుమతించారు. దాంతో ఒక్కమారుగా కార్మికుల్లో అలజడి ఏర్పడింది. ఆందోళనలో ఉంటే ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని కార్మికుల్లో ఐక్యత సన్నగిల్లింది. ఆమేరకు వారి ఆందోళన నీరుగారింది. అయితే కొంతమందిని విధుల్లోకి అనుమంతించకుండా సీఈ నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.

సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారిని కాదని, తెలుగుదేశం పార్టీ సిఫార్సులకు తలొగ్గి కార్మికులను తొలగిస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. సీఈ ఆశించిన మేరకు స్పందించకపోవడంతో కార్మికుల యూనియన్లు సమ్మె నోటీసును జారీ చేశాయి. కార్మికులకు అన్యాయం జరిగితే సహించమని ఏకతాటిపైకి యూనియన్లు రావడాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారు.
 
అండగా నిలుస్తోన్న వైఎస్సార్‌సీపీ....
ఆర్టీపీపీలో కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోంది. అనేక పర్యాయాలు ప్రత్యక్ష ఆందోళన చేపట్టిన ఎంపీ, ఎమ్మెల్యేలు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని జన్‌కో డెరైక్టర్లును కలిశారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్మికులను కాదని, వారి ఆందోళన చేస్తుండడగానే ఇతరుల్ని ఎలా అనుమతిస్తారంటూ నిలదీసినట్లు సమాచారం. ఆర్టీపీపీలో ఏ ఒక్క కార్మికునికి అన్యాయం చేసినా ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement