కృష్ణ రహస్యం!

Kurugondla Ramakrishna Secret Works on Althurupadu Reservoir - Sakshi

గోప్యంగా రూ.240 కోట్లతో ఆల్తూరుపాడు రిజర్వాయర్‌ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

ప్రచారం లేకుండానే పనులకు ఎమ్మెల్యే శ్రీకారం   

మంత్రులు లేకుండానే భూమి పూజ

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  ఎన్నికలు సమీపస్తున్న తరుణంలో గుట్టుచప్పుడు కాకుండా రూ. 240 కోట్లతో చేపట్టే డక్కిలి మండలం ఆల్తూరుపాడు రిజర్వాయర్‌ పనులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం హడావుడిగా భూమిపూజ నిర్వహించారు. భూమి పూజకు సంబంధించి నాయకులకు సమాచారం ఇవ్వకుండానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల నుంచి ఆల్తూరుపాడులో రిజర్వాయర్‌ తీసుకొస్తామని చెబుతున్న ఎమ్మెల్యే ఇన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడీ హడావుడి వెనుక కృష్ణ రహస్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. పనులు ఎవరికోకరికి అప్పగించి కమీషన్‌ జేబులో వేసుకోవడానికేనని ప్రచారం జరుగుతోంది. రూ. 240 కోట్లతో రిజర్వాయర్‌ పనులు చేపట్టాలని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడుతో ఎమ్మెల్యే రామకృష్ణ చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆల్తూరుపాడు రిజర్వాయర్‌తో పాటు కండలేరు– పూండి కాలువ నుంచి రిజర్వాయర్‌కుఎత్తిపోతల పథకం ద్వారా నీటిని నిల్వ చేసే పనుల కోసం రూ.110 కోట్లతో మరో ప్యాకేజీ పనులను ప్రభుత్వ ఆమోదించినట్లు అధికారులు చెబుతున్నారు.

సీఎం, మంత్రులు లేకుండానే భూమి పూజా?
ఆల్తూరుపాడులో రూ.240 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రామకృష్ణ భూమి పూజను పూర్తి చేయడం ఏమిటీ అని టీడీపీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు సీఎంతో కానీ, జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి ఉన్నా..వారితో కాకుండా ఎమ్మెల్యే స్వయంగా శంకుస్థాపన చేయడంపై అధకార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. రిజర్వాయర్‌ పనుల శంకుస్థాపన చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు వస్తారని ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. అయితే హడావుడిగా  సీఎం చంద్రబాబునాయుడు లేకుండానే బుధవారం ఎమ్మెల్యే రామకృష్ణ, ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌ కుటుంబ సమేతంగా వచ్చి భూమి పూజ చేశారు. కోట్లాది రూపాయిల ప్రభుత్వ నిధులతో చేపట్టే రిజర్వాయర్‌ పనుల భూమి పూజా కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. చేయని పనులు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేశామని ప్రభుత్వం చెప్పి కోట్లు ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్న తరుణంలో ఎవరికీ చెప్పకుండా చేయడంపై చర్చగా మారింది. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుగంగ అధికారులు, ఎమ్మెల్యే అనుచరులు సెల్‌ఫోన్లు సైతం ఎమ్మెల్యే కోటరీగా వ్యవహరించే పలువురు తీసుకోవడం గమనార్హం. ఒక దశలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు తమ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్న లక్ష్యంతో ఫొటోలను పంపాలని భావించినా ఎమ్మెల్యే రామకృష్ణ వారి ఫోన్లు తీసుకోవడంతో సమాచారం ఇవ్వలేకపోయారు. కొంతమంది ఫొటోలు తీయాలని ప్రయత్నించినా ఎమ్మెల్యే రామకృష్ణ ససేమిరా అన్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top