
గతేడాది కురిసిన వర్షాలకు కుంగిన మట్టికట్ట
ఇటీవల కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్న కట్ట
సాక్షి, అమరావతి: శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల్లో అంతర్భగామైన గోరకల్లు (నరసింహరాయ సాగర్) రిజర్వాయర్ మట్టికట్ట మరమ్మతులకు ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మరమ్మతు పనులు చేపట్టాలని కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈని ఆదేశిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరకల్లు వద్ద 11 టీఎంసీల సామర్థ్యంతో గోరకల్లు రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ మట్టికట్ట గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. రివిట్‌మెంట్ కుంగిపోయింది. భారీ గోతులు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ భద్రత దృష్ట్యా తక్షణం మట్టికట్ట మరమ్మతులకు రూ.58.90 కోట్లు మంజూరు చేయాలని గతేడాది డిసెంబర్ 12న కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
కానీ.. అప్పట్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టికట్ట మరింతగా దెబ్బతింది. ఇది రిజర్వాయర్ భద్రతను ప్రశ్నార్థకం చేసింది. మట్టికట్టసహా రిజర్వాయర్ భద్రతకు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది జూలై 4న కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ ప్రభుత్వానికి మరోసారి నివేదిక పంపారు.