కృష్ణ..కృష్ణా! | krishna water not released partially | Sakshi
Sakshi News home page

కృష్ణ..కృష్ణా!

Feb 4 2015 4:15 AM | Updated on Aug 29 2018 9:29 PM

అధికారులు సరైన ప్రణాళిక రూపొందించుకోని ఫలితంగా విలువైన కృష్ణా జలాలు అనంతపురం రైతులకు అనుకున్న మేరకు ఉపయోగపడలేదు.

అనంతపురం: అధికారులు సరైన ప్రణాళిక రూపొందించుకోని ఫలితంగా విలువైన కృష్ణా జలాలు అనంతపురం రైతులకు అనుకున్న మేరకు ఉపయోగపడలేదు. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఈ ఏడాది 15.02 టీఎంసీలు ఎత్తిపోశారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 841 అడుగులు జలమట్టం ఉంది. 834 అడుగులకు చేరే వరకూ మనం 'హంద్రీ-నీవా'కు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. మరో 15 రోజులపాటు ఎత్తిపోతలు కొనసాగే అవకాశం ఉంది. తద్వారా మరో టీఎంసీ జలాలు అదనంగా చేరుతాయి. కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ఎనిమిది లిప్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు.

ఒక టీఎంసీ నీళ్లు ఎత్తిపోసేందుకు తొమ్మిది రోజులు పడుతోంది. ఇందుకు సుమారు 12 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది. అంటే 15.2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు ఈ ఏడాది 182.4 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ లెక్కన డబ్బు ఖర్చుకు వెనుకాడక కరువు సీమకు నీటిని తెప్పించాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరింది. ఒక టీఎంసీతో 10 వేల ఎకరాల చొప్పున 15.2 టీఎంసీలతో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. ఇందులో 2 టీఎంసీలు వృథా పోయినా, 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు కచ్చితంగా అందించొచ్చు. కానీ ఈ ఏడాది అనంతపురానికి చేరిన కృష్ణా జలాలతో కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు.

లోపించిన ప్రణాళిక
జిల్లాకు వచ్చి చేరిన నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక అధికారులు ఇష్టానుసారం నీటిని విడుదల చేశారు. 15.2 టీఎంసీలలో ఎనిమిది టీఎంసీలు పీఏబీఆర్‌కు పంపారు. గుంతకల్లు నుంచి అనంతపురం మధ్యలోని చెరువుల్లో 1.3 టీఎంసీలు నింపారు. 3 టీఎంసీలు కర్నూలు జిల్లాకు వదిలారు. మరో 3 టీఎంసీలు వృథా అయ్యుండొచ్చని అధికారులు లెక్కగడుతున్నారు. కర్నూలు జిల్లాలో హంద్రీ-నీవా కింద 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే 15 వేల ఎకరాలకూ సాగు నీరు అందింది.

అనంతపురంలో ఫేజ్-1లో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఒక ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. పీఏబీఆర్‌కు పంపిన నీటిలో 49 చెరువులకు 6.39 టీఎంసీలు, శింగనమల చెరువుకు 0.1 టీఎంసీ, తాడిపత్రి పెన్నానదిలోకి 0.25 టీఎంసీల నీటిని విడుదల చేశారు. తద్వారా చెరువుల కింద 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందినట్లు మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. సరైన ప్రణాళిక లేని కారణంగా మిగతా ఆయకట్టుకు నీరందలేదు.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురంలోని జీడిపల్లి రిజర్వాయర్ వరకు 216 కిలోమీటర్ల కాలువ ఉంది. ప్రధాన కాలువతో పాటు జిల్లాల వారీగా నిర్దేశించిన ఆయకట్టుకు ఉప, పిల్ల కాలువల పనులను (డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ) చాలా చోట్ల పూర్తి చేయలేదు. దీంతో వచ్చిన నీటిని ఏం చేయాలో అధికారులకు అంతుపట్టక పీఏబీఆర్‌లో కలిపి తుంగభద్ర, కృష్ణ జలాలను ఏకం చేశారు. ఓ మంత్రి తన నియోజకవర్గంలోని చెరువులు నింపాలని హుకుం జారీ చేస్తే, మరో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని చెరువులకు నీరివ్వాలని ఒత్తిడి చేశారు. ఎందుకొచ్చిన గొడవనుకుని అధికారులు వారు చెప్పినట్లు గేట్లు ఎత్తేశారు. ఇలా నీరు సాగుకు ఉపయోగపడకుండా పక్కదారి పట్టింది. ప్రజాప్రతినిధులు స్పందించి రూ.400 కోట్లు విడుదల చేరుుస్తే వచ్చే ఖరీఫ్‌కైనా మెుదటి విడతలో పొలాలకు నీరందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement