ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వని బాబు సర్కార్
పర్యావరణ అనుమతిపై 2024 నవంబర్ 5,2025 జనవరి 1న సమావేశాలు నిర్వహించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ
చంద్రబాబు సమాచారం ఇవ్వకపోవడంతో 2025 ఫిబ్రవరి 27న ఈఏసీ సమావేశంలో పర్యావరణ అనుమతి ఇవ్వని వైనం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం వల్లే సీమ ఎత్తిపోతలను అడ్డుకున్న చంద్రబాబు
ఇదే అంశాన్ని గతేడాది మార్చి 19న లోక్‌సభలో ప్రస్తావించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ.. తడారిన గొంతులు తడిపేందుకు.. తెలుగుగంగ, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ) కింద 9.6 లక్షల ఎకరాల్లో పంటలను రక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’ పట్టుకుంది! ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్ 5న.. 2025 జనవరి 1న నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు.
దాని పర్యవసానంగానే గతేడాది ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని లోక్‌సభలో గతేడాది మార్చి 19న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రస్తావించి చంద్రబాబు సర్కార్ తీరును కడిగిపారేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్‌తో కేసు..
ఓటుకు కోట్లు కేసు భయంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టడంతో 2014–19 మధ్య ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని తడారిన గొంతులను తడపడం, ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఆ పనులను రూ.3,707.06 కోట్ల వ్యయంతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్‌తో ఎన్జీటీ (చెన్నై బెంచ్) లో ఆ ప్రాంతంలోని టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ, పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్‌లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి.
అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు గత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. 22.54 శాతం పనులు పూర్తి చేశారు.
చీకటి ఒప్పందంతో పనులు నిలిపివేత
సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీన్ని బట్టి తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేసి.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను మళ్లీ తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు.
ఈ చీకటి ఒప్పందం కుదరడం వల్లే.. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ కావాలనే ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిచిపోవడానికి పర్యావరణ అనుమతి రాలేదనే సాకులు చూపడానికే చంద్రబాబు సర్కార్ ఈఏసీకి వివరాలు అందజేయలేదని స్పష్టం చేస్తున్నారు.


