అధికారులు సీఎంలా నిర్లక్ష్యంగా ఉండొద్దు : పార్ధసారధి

Kolusu Parthasarathi Fires on Chandrababu naidu - Sakshi

సాక్షి, విజయవాడ : పెథాయ్‌ తుపాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో కోతలు పూర్తి కాలేదని, కుప్పలు కూడా వేసిన పరిస్థితిలేదన్నారు. రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులలో రైతులకు ఆసరాగా ఉండాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాలికొదిలేసి రాజకీయక్రీడలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

విజయవాడ పార్టీ కార్యలయంలో పార్ధసారధి మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో క్షుద్రపాలన జరుగుతోంది. రాజకీయాలు, ఇతర పార్టీలతో సంబంధాలు అనేవే చంద్రబాబుకు ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తోంది. క్షుద్రపూజలు అర్ధరాత్రి పూట జరుగుతుంటాయి. చంద్రబాబు కూడా ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇచ్చేసి తుపానుపై అర్ధరాత్రి సమీక్షలు చేస్తున్నారు. పెథాయ్‌ తీవ్రతను బట్టి ప్రభుత్వం అత్యవసర పరిస్దితిని ప్రకటించింది. అధికారులందరికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఆర్టీసి, రైల్వేల సర్వీసులు రద్దు చేశారు. స్కూళ్లకు సైతం సెలవులు ఇచ్చారు.

24 గంటలు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన చంద్రబాబు వేరే రాష్ట్రాల సీఎంల ప్రమాణస్వీకారానికి వెళ్లారు. తుపాను వచ్చే సమయంలోనే సీఎం పనిచేయరు. తుపాను వచ్చాక అధికారులను పనిచేయనివ్వరు. తుపాను సహాయక చర్యల సమయంలో చంద్రబాబు మందిమార్భలంతో వచ్చి అధికారుల పనులకు అడ్డుతగులుతుంటారు. నేడు వేరే రాష్ట్రాలలో ఉన్న చంద్రబాబు రేపు వచ్చి హడావుడి చేస్తారు. మరో రెండు రోజులు అయ్యాక కేంద్రం డబ్బులు ఇవ్వడంలేదు అంటూ ప్రచారం స్టార్ట్ చేస్తారు. తర్వాత హుద్ హుద్ సమయంలో లాగానే పెథాయ్‌ను కూడా చంద్రబాబు జయించేశాడంటారు.

ఈరోజు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎవ్వరూ అందుబాటులో లేరు. సొంతపనులపై వెళ్లారని తెలిసింది. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారులందరూ కూడా ముఖ్యమంత్రిలా నిర్లక్ష్యంగా ఉండొద్దు. రిపోర్ట్‌ల కోసం గణాంకాలకోసం పనిచేయొద్దు. రైతులకు భరోసా కల్పించండి. నష్టతీవ్రతను తగ్గించే చర్యలు చేపట్టాలి. ప్రకృతి వైపరిత్యాల సమయంలో గతంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని సకాలంలో అందించడం లేదు. ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుని రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.

వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను విహారయాత్రలకు తీసుకువెళ్తున్నారు. పోలవరం  పూర్తవ్వాలంటే మూడు నాలుగేళ్లు పడుతుందని అక్కడికి వెళ్లిన వారందరూ చెబుతున్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం అనుమతులు సాధించారు. కాలువలు తవ్వించారు. ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించేలా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో చంద్రబాబు పాత్ర సున్నా. కేవలం ముడుపుల కోసమే ఇది చేపట్టారు.

తాము నీళ్లిస్తామంటూ వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి మంత్రి దేవినేని చాలాసార్లు చెప్పారు, అవన్నీ కల్లబొల్లి మాటలుగా తేలిపోయాయి. అలా నీరు ఇవ్వలేరని తేలిపోయింది. ఏదైనా ఒక వస్తువును ఎక్కువ ధర పెట్టి కొంటే దానిలో స్పెషాలిటి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం కూడా చదరపు అడుగుకు రూ. 11, 666 వెచ్చించి కట్టారు. అందుకే వర్షం వచ్చినపుడల్లా లీకవుతుంటుంది. అదేదాని స్పెషాలిటీ. దీనిని బట్టి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఇలాగే ఉంటుందని అర్థమవుతోంది' అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top