దొంగ ఓట్లు అరికట్టండి

Kethireddy Venkat Rami Reddy Complaint on Fake Votes - Sakshi

 కలెక్టర్‌కు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు  

ఎమ్మెల్యే భార్య పేరుపై రెండు ఓట్లు

న్యాయవాదికి మూడు చోట్ల ఓటు హక్కు

నిరంతరం దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్న టీడీపీ నాయకులు

అనంతపురం ,ధర్మవరం అర్బన్‌: ‘ఎమ్మెల్యే సూరి భార్య నిర్మలాదేవి పేరుపై వరదాపురం గ్రామ  బూత్‌ నంబర్‌ 134లో 620 సీరియల్‌ నంబర్‌ మీద ఒక ఓటు, ధర్మవరంలోని బూత్‌ నంబర్‌ 230లో 552 సీరియల్‌ నంబర్‌ కింద మరో ఓటు హక్కు ఉంది. అలాగే న్యాయవాది సుబ్బరావు పేరుపై మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించారు. ఈ పరిస్థితి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. టీడీపీ నాయకులు నిరంతం దొంగ ఓట్లు నమోదు చేయించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్‌సీపీ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోండి’ అంటూ జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌కు ఆయన అందజేశారు.  

అనంతరం విలేకరులతో కేతిరెడ్డి మాట్లాడుతూ..  చింతలపల్లిలో ఉన్న నారా తిప్పానాయుడు, నారా విశాలకు అనంతపురం అర్బన్‌ 108 బూత్‌లో,  మహేశ్వరమ్మ, శంకర్‌నాయుడుకు 105 బూత్‌లో డబుల్‌ ఎంట్రీలు ఉన్నాయన్నారు. దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్మవరంలోని సీసీకొత్తకోట గ్రామంలో ఓట్లను బీఎల్‌ఓలు తొలగించారన్నారు. మల్కాపురం గ్రామంలో తాము స్థిరంగా ఉన్నామంటూ ఆధారాలు ఇచ్చినా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల 25 మంది ఓట్లు తొలగించారన్నారు. ధర్మవరంలోని 184వ బూత్‌లో 34 ఓట్లు డబుల్‌ ఎంట్రీతో ఉన్నాయన్నారు. వీటిని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా బత్తలపల్లి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న సురేష్‌..  టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను ఓటరు జాబితాలో ఎక్కించకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ధర్మవరం కార్యాలయంలో శ్రీనాథ్‌ అనే వ్యక్తి బీఎల్‌ఓలను ఆర్డీవో  కార్యాలయంలో కూర్చోబెట్టి గూడూపుఠాని నడిపించారన్నారు. ఈ అక్రమాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల కమిషన్‌కూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. తెలిసి చేసినా, తెలియకుండా చేసినా సెక్షన్‌ 31 కింద ఎమ్మెల్యే భార్య నిర్మలాదేవి నేరస్తురాలిగా శిక్ష అనుభవించకతప్పదన్నారు. సెక్షన్‌ 32 ప్రకారం అధికారులకూ రెండేళ్లపాటు శిక్ష పడే అవకాశముందన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top