ప్రజా ప్రయోజనాలు పట్టవా?: కరణం ధర్మశ్రీ

Karanam Dharma Sri Release Press Note Against Eenadu News - Sakshi

విశాఖ ఇమేజిని దెబ్బతీయటానికి చంద్రబాబుతో కలిసి కుట్ర

సాక్షి, విశాఖపట్నం: సోమవారం ఈనాడు పేపర్‌లో వచ్చిన ‘తీరంలో చీలిక’ వార్తపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిలో ఆయన ‘ఉత్తరాంధ్రకు సెక్రెటేరియట్‌ వస్తుందంటే, చంద్రబాబు నాయుడుతోపాటు రామోజీరావుగారికి కూడా నిద్ర పట్టటం లేదని ఈ రోజు ‘ఈనాడు’లో వచ్చిన వార్తను చూస్తే అర్థమవుతోంది. ఈ వార్తను తెలుగుదేశం నేతలు తమ పలుకుబడి ఉపయోగించి మరో రెండు ఆంగ్లపత్రికల్లో కూడా ప్రచురింపజేశారు. ఇంతకీ ఈ వార్తలో ఏముందంటే... ఎప్పుడో 1 కోటీ 60 లక్షల సంవత్సరాల క్రితం తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు 300 కిలోమీటర్ల మేర సముద్రంలో చీలిక ఏర్పడిందట. దాన్ని చూపించటానికి... ఓ పటం వేసి విశాఖపట్టణం అని రాశారు. 68 లక్షల సంవత్సరాల పూర్వం నుంచి 30 లక్షల సంవత్సరాల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేదట. ఇంతవరకూ మాత్రమే రాస్తే అది ఈనాడు ఎందుకవుతుంది’ అంటూ ఎద్దేవా చేశారు. 

ఏమిటీ రాతలు రామోజీరావుగారూ..
‘అందుకే ఆ సముద్ర గర్భంలో చీలిక వల్ల భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చునని ఎవరో ఓ ప్రొఫెసర్‌ను పట్టుకుని చెప్పించారు. పనిలోపనిగా, అమరావతి ఒక్కచోటే రాజధాని ఉండాలని కూడా ఆ శాస్త్రవేత్తలతోనే చెప్పించి ఉంటే మరింత బాగుండేది. మొట్టమొదటగా మీరు పెట్టిన ఈనాడు విశాఖలోనే. మీ డాల్ఫిన్‌ హోటల్‌ విశాఖలోనే. మీ ఆస్తులు విశాఖలోనే. విశాఖకు ముప్పుందంటున్న మీరు మీ ఆస్తులన్నింటినీ ఖాళీ చేయించి మీ ఉద్యోగుల్ని ఇక్కడ నుంచి తక్షణం బయటకు తీసుకువెళ్ళిపోతారా. అసలు విశాఖకు ముప్పుందా.. ఎవరిది చెప్పింది’ అని ప్రశ్నించారు. అంతేకాక ‘మనకు ఆధారాలతో తెలిసిన మానవ చరిత్ర సింధు నాగరికత నుంచే కదా. అంటే కేవలం 6 వేల సంవత్సరాల నుంచే కదా. మరి 30 లక్షల సంవత్సరాల క్రితమే ఆగిపోయిన అలజడి... ఇప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోవటం వల్ల మళ్ళీ మీలో రేగిందా.. లేక... అమరావతిలో చంద్రబాబు కొనుగోలు చేసిన భూములమీద మీకు కూడా ప్రేమానురాగాలు పెరిగాయా’ అని ప్రశ్నించారు. (ఇంకా ఎందుకు నవ్వులపాలవుతారు?)

అంతేకాక ‘విజయవాడలోనే సెక్రెటేరియట్, హైకోర్టు ఉంటే... హైదరాబాద్‌లో రామోజీ ఫిలింసిటీకి డిమాండ్‌ పడిపోకుండా ఉండాలన్నది మీ ఆలోచనలా ఉంది. విశాఖపట్టణం అభద్రం... మొత్తంగా తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అంతా అభద్రం అనే వార్త రాసే ముందు అందులో నిజానిజాలతో సంబంధం లేకుండా ఎలా అచ్చువేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను భయపెట్టాలని ఎందుకు చూస్తున్నారు. మీ చంద్రబాబు ప్రయోజనాలు, మీ తెలుగుదేశం ప్రయోజనాలు తప్ప మీకు ప్రజా ప్రయోజనాలు పట్టవా. ఈస్ట్రన్‌ నేవెల్‌ కమాండ్‌ ఎక్కడ ఉంది.. విశాఖలోనే కదా. సబ్‌మెరైన్‌ బేస్‌ భారతదేశానికి ఎక్కడ ఉంది.. విశాఖలోనే కదా. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేంద్రం విశాఖ. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం. విశాఖ ఇమేజిని, ఉత్తరాంధ్ర ప్రాభవాన్ని దెబ్బతీయటానికి చంద్రబాబుతో కలిసి ఇంతకు దిగజారతారా. దీన్ని జర్నలిజం అంటారా’ అంటూ ధర్మశ్రీ వరుస ప్రశ్నలు కురిపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top