అభిషేక ప్రసాదం.. అంతంతే

Kanipakam Temple Officials Delayed on Prasadam - Sakshi

స్వామివారి చిత్రపటాల స్థానంలో క్యాలెండర్ల పంపిణీ

ఐదు నెలల తరువాత ఇచ్చే క్యాలెండర్లు ఏం చేసుకోవాలని భక్తుల విమర్శ

పులిహోర ప్రసాదంలోనూ నాణ్యత పాటించని వైనం

కాణిపాకంలో అధికారుల లీలలు

కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన  స్వామివారి చెంత (నిత్య సేవలు నిర్వహిస్తే) మొక్కులు తీర్చుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కాగా ప్రధాన సేవల్లో ప్రత్యేక అభిషేకం, సత్యప్రమాణం, నిజరూప దర్శనం, పాలాభిషేకం, గణపతి హోమం, కల్యాణోత్సవ సేవలు ఉన్నాయి. ఈసేవల్లో పాల్గొనే వారికి దేవస్థానం ప్రత్యేక ప్రసాదాలను, చిత్రపటాలను, వస్త్రాలను సంప్రదాయ బద్ధంగా తరతరాలుగా అందజేస్తోంది. అయితే ఈక్రమంలో ప్రస్తుతం ఆలయంలో నిత్య సేవల్లో పాల్గొనే భక్తులకు ఇచ్చే ప్రసాదాల్లో అధికారులు అనధికార కోతలు విధిస్తున్నారు. తాజాగా అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు అందించే స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను రద్దు చేశారు. వాటి స్థానంలో దేవస్థానం క్యాలెండర్లను అందజేస్తున్నారు. దీంతో భక్తులు ఐదు నెలల తరువాత క్యాలండర్లు ఇస్తే తామేం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

ప్రసాదాల్లో కోత
వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నిత్యసేవలో పాల్గొని ప్రత్యేక అభిషేకం చేసే భక్తులకు దేవస్థానం నుంచి మొదటగా రూ.550 చెల్లించి టికెట్‌ కొనుగోలు చేయాలి. ఒక్కో టికెట్‌పై ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. అభిషేకసేవకు కావాల్సిన సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది. ఈసేవలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం నుంచి కండువ, జాకెట్టు, స్వామివారి చిత్రపటం, రెండు రకాలతో కూడిన నైవేద్య ప్రసాదాన్ని అందజేసే వారు. అయితే ప్రస్తుతం ఒక క్యాలెండర్, జాకెట్టు, కండువ, రెండు రకాల ప్రసాదాలు (కొద్దిమేరకు ) పంపిణీ చేస్తున్నారు.

అభిషేకం పేరు చెప్పి అడ్డంగా దోపిడీ
కాణిపాక ఆలయంలో ఉదయం 6, 9, 11 గంటలకు మూడు పర్యాయాలుగా ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఒక్కో అభిషేకానికి సగటున (రద్దీ సమయాల్లో ) 30 నుంచి 40 అభిషేకాలు నిర్వహిస్తారు. ఈక్రమంలో మూడు అభిషేకాలకు 100 వరకు టికెట్‌లను ఒక్కొక్కటి రూ. 550 చొప్పున విక్రయిస్తారు. ఈ లెక్కన దేవస్థానానికి రోజుకు రూ. 55,000 వరకు ఆదాయంగా వస్తుంది.
అయితే ఈ సామూహిక సేవకు ఉపయోగించే సామాగ్రి పరిశీలిస్తే మూడు టెంకాయలు, పసుపు, కుంకుమ, గంధం, తేనె, నెయ్యి, పన్నీరు, పాలు (ప్యాకెట్‌ పాలు), అరటి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్, చెక్కెరను వినియోగిస్తారు. వీటి మొత్తానికి కలిపి ఒక్క విడతకు కేవలం రూ.2 నుంచి రూ.4 వేలు  మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన మూడు అభిషేకాలకూ రూ. 10వేలలోపే వెచ్చిస్తున్నారు. ఈక్రమంలో చివరికి స్వామివారి పటం కూడా తొలగించడం వివాదా నికి కారణమవుతోంది. గతంలో వెండి కాయిన్, లడ్డూ కూడా ఇచ్చేవారని అయితే ప్రస్తుతం పులిహోరా వంటి వాటిలోనూ కనీస నాణ్యత లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారుల సూచనల మేరకే ..
అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు మొదట్లో స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించే వాళ్లం. అయితే తాజాగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు.. వాటి స్థానంలో క్యాలెండరు, కొద్దిపాటి ప్రసాదాలను అందజేస్తున్నాం. ఇందులో మా ప్రమేయం లేదు.  భక్తులు సహకరించాలని కోరుతున్నాం.      – స్వాములు,ఆలయ సూపరింటెండెంట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top