14న ప్రధానికి తుది నివేదిక | Sakshi
Sakshi News home page

14న ప్రధానికి తుది నివేదిక

Published Thu, Jul 31 2014 2:07 AM

14న ప్రధానికి తుది నివేదిక - Sakshi

13న రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కమలనాథన్ కమిటీ భేటీ
ఇదే భేటీలో రెండు రాష్ట్రాల ఆమోదానికి నివేదిక

 
 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల విభజనపై తుది నివేదికను వచ్చే నెల 14న ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించాలని కమలనాధన్ కమిటీ నిర్ణయించింది. నివేదికను ఖరారు చేసేందుకు 13వ తేదీన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానుంది. అనంతరం ప్రధానికి సమర్పించే నివేదికపై కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఏర్పాటైన ఈ కమిటీ ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగుల నుంచి ఆగస్టు 5 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అభ్యంతరాల పరిశీలన అనంతరం మార్గదర్శకాల్లో అవసరమైన మేరకు సవరణలు చేసి రాష్ట్రస్థాయి కేడర్‌కు చెందిన 76 వేల పోస్టులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 58:42 నిష్పత్తిలో పంపిణీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో 23 వేల పోస్టులు ఖాళీగా ఉండగా మిగతా ఉద్యోగుల పంపిణీ కసరత్తును కమిటీ వేగవంతం చేసింది. వచ్చే నెల 13వ తేదీనాటి సమావేశంలోనే ఉద్యోగుల విభజనపై తుది నివేదికను రెండు రాష్ట్రాల ఆమోదానికి పెట్టనున్నారు.

నివేదికపై అంగీకారం తెలుపుతూ రెండు రాష్ట్రాలూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రం అంగీకరించకపోయినా ఉద్యోగుల పంపిణీ మరిన్ని రోజులు జాప్యం కాక తప్పదు. కమలనాధన్ కమిటీ మార్గదర్శకాల్లో కొన్నిటిని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తుంటే. మరికొన్నిటిపై ఏపీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే నెల 13వ తేదీ నాటికి తుది నివేదిక సిద్ధం చేయూలని కమిటీ భావిస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏమేరకు సాధ్యమవుతుందో అన్న అనుమానం కమిటీ సభ్యుల్లోనే వ్యక్తమవుతోంది. అయితే కమిటీ తుది నివేదికను ఏ రాష్ట్రమైనా అంగీకరించని పక్షంలో తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీ చైర్మన్‌గా కమలనాధన్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయని అంటున్నారు.
 

Advertisement
Advertisement