చప్పట్లతో సీఎం జగన్‌ అభినందనలు

Janata Curfew Is Successful Across Andhra Pradesh - Sakshi

స్వీయ నిర్బంధంలోకి జనం ఇళ్లకే పరిమితం..

మూతపడ్డ అన్ని దుకాణాలు,హోటళ్లు, షాపులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు 

విధుల్లోనే పోలీసులు, వైద్యులు 

విజయవాడలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌ అమలు

జనతా కర్ఫ్యూ విజయవంతంపై ముఖ్యమంత్రి సంతోషం

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) వ్యాప్తిని నియంత్రించడం కోసం పాటుపడుతున్న సిబ్బందిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చప్పట్లు కొట్టి అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తాడేపల్లిలోని తన నివాసం వద్ద మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలసి చప్పట్లు కొట్టారు. జనతా కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జవాన్లు, పోలీసులతో పాటు అత్యవసర సేవలు అందించే ప్రతి ఒక్కరికి సెల్యూట్‌ చేస్తున్నానని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నవారికి రుణపడి ఉంటామని చెప్పారు.

జయహో ‘జనతా’!
ప్రమాదకర కోవిడ్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రజలు పాటించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలంతా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేశాయి. అన్ని దుకాణాలు, రెస్టారెంట్లు, షాపులు, పెట్రోల్‌ బంకులు, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, మార్కెట్లు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, బార్లు, మద్యం షాపులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరులతోపాటు అన్ని ప్రధాన పట్టణాల్లో మాల్స్‌ మూతపడ్డాయి. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ కార్మికులు శానిటైజేషన్‌ చేశారు. వైద్యులు, పోలీసులు తమ విధులను చక్కగా నిర్వహించి భేష్‌ అనిపించుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తక్షణ సహాయ చర్యల కోసం పలు ప్రాంతాల్లో పర్యటించారు.

- విజయవాడలో ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగమయ్యారు. ఎప్పుడూ మార్నింగ్‌ వాక్‌ చేసే వారితో నిండి ఉండే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం జనతా కర్ఫ్యూతో బోసిపోయింది. అనాథలు, యాచకులకు పోలీసులు ఆహార పొట్లాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
- విజయవాడలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు వెలుగుచూడటంతో కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హైఅలర్ట్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 14 వరకు విజయవాడలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 
- బెంగళూరు నుంచి వస్తున్న రైలులో కోవిడ్‌ సోకిన వారున్నారనే అనుమానంతో ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో బిహార్‌కు చెందిన ఆరుగురిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. 
- అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. చిన్నారులు, గర్భిణులకు ఇళ్లకే పోషకాహారం పంపిణీ చేస్తున్నారు.
- ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజలు కోవిడ్‌ నిర్మూలనకు విశేష సేవలు అందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి, వైద్యులకు, పోలీసులకు, కార్మిక వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. కొందరు ప్లేటుపై గరిటెతో చప్పుడు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. 

జిల్లాల్లో ఇలా..
- కర్నూలు జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రులకు, మెడికల్‌ షాపులకు మాత్రమే జనం బయటకు వచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూకు సహకరించారు. శ్రీశైలం, మహానంది, మంత్రాలయం తదితర ఆలయాలను మూసివేశారు.
- అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, దేవాలయాలు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు మూసేశారు. అనంతపురం సర్వజనాస్పత్రిలోని కోవిడ్‌ ఐసోలేటెడ్‌ వార్డులో ఏడుగురు అనుమానితులున్నారు. ఆస్పత్రిలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. 
- చిత్తూరు జిల్లాలో రేణిగుంట విమానాశ్రయం నుంచి వెళ్లి వచ్చే 14 విమాన సర్వీసులను రద్దు చేశారు. తిరుమలతోపాటు కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, నాగలాపురంలోని ప్రముఖ ఆలయాల్లో దర్శనానికి భక్తులను అనుమతించలేదు. తిరుపతిలోని జూపార్క్, సైన్స్‌ సెంటర్, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులను మూసేశారు.
- శ్రీకాకుళం జిల్లాలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర వైద్యసేవలు పొందే రోగులు మినహా ఆస్పత్రులు కూడా ఖాళీగానే దర్శనమిచ్చాయి. నిత్యావసర సరుకుల దుకాణాలు సైతం మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కోవిడ్‌ నిరోధానికి హోమాలను జరిపించారు.
తూర్పుగోదావరిలో ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు గుమ్మం దాటి బయటకు రాలేదు. కోల్‌కతా – చెన్నై 16వ నంబర్‌ జాతీయ రహదారి నిర్మానుష్యంగా కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే కొవ్వూరు – రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన, గోదావరిపై ఉన్న నాలుగో వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయాలు మూతపడ్డాయి. 
- ప్రకాశం జిల్లాలో జనతా కర్ఫ్యూకు జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. అనాథలకు భోజనం, వాటర్‌ బాటిళ్లు అందించి పోలీసు అధికారులు ఔదార్యాన్ని చాటుకున్నారు. 
- విశాఖ తూర్పు నౌకాదళంలో సేవలన్నీ నిలుపుదల చేశారు. అత్యవసర సేవలు, భద్రతా అంశాల్లో సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఇక విశాఖ జిల్లాలో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల ముందు నుంచే ప్రజల్లో అవగాహన కల్పించడంతో విజయవంతమైంది. 
- గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్దే ఉండి స్వీయ నిర్బంధం పాటించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి జిల్లాకు మొత్తం 1138 మంది వచ్చినట్లు గుర్తించారు. ఆదివారం వీరి ఇళ్లకు తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, పోలీసులు, వైద్యాధికారుల బృందం వెళ్లి వివరాలు సేకరించారు. ప్రస్తుతం వీరంతా హోం ఐసోలేషన్‌లో కొనసాగుతున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. ఇంతకుముందు సేకరించిన ఐదుగురి నమూనాలకు సంబంధించి పరీక్ష ఫలితాల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది.
- విజయనగరం జిల్లాలో ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారు. ఏడుగంటల తరువాత ప్రజలెవరూ బయటకు రాలేదు. పారిశుధ్ధ్య కార్మికులు మాత్రమే ఉదయం తమ విధుల నిర్వహణకు బయటకు వచ్చారు. విజయనగరం నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికారులు వీధుల్లో క్లోరిన్‌ వాటర్, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. దాదాపు 875 బస్సులు బయటకు రాకుండా డిపోలకే పరిమితమయ్యాయి. 
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యవసరమైన వారు మినహా మిగతా ఎవరూ వీధుల్లోకి రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. హౌరా నుంచి యశ్వంతపూర్‌ వెళుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఎస్‌–5 కోచ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు విదేశీ ప్రయాణికులు కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో సహచర ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు రైలును బిట్రగుంట స్టేషన్‌లో 30 నిమిషాలకు పైగా నిలిపి వారికి చికిత్స చేయించారు.
- పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లల్లోనే ఉండిపోవడంతో ఉదయం ఏడుగంటల నుంచి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రజలు బయటకు రాలేదు. రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. పారిశుద్ధ్య కార్మికులు, అసుపత్రి సిబ్బంది, వైద్యులు, పోలీసులు, మీడియా మాత్రమే తమ విధులలో భాగంగా బయటకు వచ్చారు. విదేశాల నుంచి జిల్లాకు 2,900 మందికిపైగా వచ్చినట్లు గుర్తించారు. వీరందరినీ ఇళ్లవద్దే ఐసొలేషన్‌లో ఉంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 
- జనతా కర్ఫ్యూ వైఎస్సార్‌ జిల్లాలో విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్, మార్కెట్లు, దుకాణాలు, పార్కులు, కార్యాలయాలు మూతబడ్డాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top