మీడియాపై దాడి అమానుషం | jalil khan activities attacked in sakshi journalist | Sakshi
Sakshi News home page

మీడియాపై దాడి అమానుషం

Mar 28 2016 12:23 AM | Updated on Aug 10 2018 8:46 PM

మీడియాపై దాడి   అమానుషం - Sakshi

మీడియాపై దాడి అమానుషం

విజయవాడలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో కొందరు వ్యక్తులు మీడియా ప్రతినిధులపై .....

 సాక్షి  సిబ్బందిపై దాడికి జర్నలిస్టు సంఘాల ఖండన
 
విజయవాడ : విజయవాడలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో కొందరు వ్యక్తులు మీడియా ప్రతినిధులపై దాడిచేయటాన్ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యుజే అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జి.రామారావు, దారం వెంకటేశ్వరరావు ఒక సంయుక్త ప్రకటనలో ఖండించారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో సాక్షి ఫొటో జర్నలిస్టు ఐ.సుబ్రమణ్యం, టీవీ వీడియో జర్నలిస్టు సంతోష్‌లపై జలీల్‌ఖాన్ అనుచరులు దాడి చేయటం శోచనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా ప్రతినిధులను చితకబాది కెమెరాలు లాక్కోవటం దారుణమన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి చట్టప్రకారం కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు.

 కఠిన చర్యలు తీసుకోవాలి
 వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు

సాక్షి’ మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జలీల్‌ఖాన్‌లో తీవ్ర అభద్రతా భావం నెలకొంది. వైఎస్సార్‌సీపీ జారీ చేసిన విప్‌ను అందజేయడానికి పార్టీ నేతలు వెళితే ఆ వార్త కవరేజీ కోసం వెళ్లిన కెమెరామేన్‌లపై జలీల్‌ఖాన్ అరవడం, దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన సిబ్బంది దాడి చేయడం గర్హనీయం. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే మీడియాపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. రాజకీయ పార్టీలతో జలీల్‌ఖాన్ విభేదించవచ్చు కానీ, మీడియా ప్రతినిధులతో విభేదించడం సరికాదు.

జలీల్‌ఖాన్ తనవెంట పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు కూడా రాకపోవడంతో తన ప్రతిష్ట దెబ్బతిందని తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు కనబడుతున్నారు. అందువల్లే కెమెరామేన్‌లపై దాడికి పాల్పడ్డారు. రాజధానిగా మారిన విజయవాడలో ఇటువంటి ఘటనలు జరగడం అమానుషం. దీనివల్ల రాజకీయ నాయకులపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. దాడి చేసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలి. జలీల్‌ఖాన్ తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

 జలీల్‌ఖాన్ రాజీనామా చేయాలి
 లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ విజయవాడ  నగర ఇన్‌చార్జి

పార్టీ మారిన జలీల్‌ఖాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై, విప్ తీసుకోకుండా నిరాకరించటం, దౌర్జన్యకరంగా వ్యవహరించటం గర్హనీయం. విప్ జారీ చేయటానికి వెళ్లిన విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు అంజిరెడ్డిపై, సాక్షి మీడియా కెమెరామేన్‌లు సుబ్రహ్మణ్యం, సంతోష్‌లపై జలీల్‌ఖాన్ అనుచరులు దాడి చేయటం దారుణం. ఈ ఘటనకు పాల్పడ్డ ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులను ప్రతిఒక్కరూ ఖండించాలి. టీడీపీ హయాంలో మీడియాపై దాడులు పెచ్చుపెరిగాయి.

విప్ తీసుకోకుండా దాడికి
పాల్పడటం దారుణం : కొడాలి నాని,  వైఎస్సార్‌సీపీ తూర్పు కృష్ణా అధ్యక్షుడు

 పార్టీ జారీ చేసిన విప్ తీసుకోకుండా పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అనుచరులు దాడికి పాల్పడటం దారుణం. పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు. విప్ ఇవ్వటానికి వెళ్లిన కార్యకర్తలపై దౌర్జన్యం చేసి, మీడియా ప్రతినిధుల నుంచి కెమెరాలు లాక్కుని బీభత్సం సృష్టించారు. జలీల్‌ఖాన్, అతని అనుచరులు దాడికి పాల్పడింది గాక ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అండ చూసుకుని జలీల్‌ఖాన్ అనుచరులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ కేసులో పోలీసులు చట్టప్రకారం కేసులు నమోదు చేయాలి. పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరపాలి.

 దాడి వెనుక ప్రభుత్వ హస్తం ఉంది
 కొలుసు పార్ధసారథి, వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి

ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు విప్ జారీ చేయటానికి వెళ్లిన పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు డి.అంజిరెడ్డిపై, సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం వెనుక టీడీపీ ప్రభుత్వ హస్తం ఉంది. విప్ జారీకి వెళ్లిన పార్టీ కార్యకర్తలపై దాడి జరగటం, కెమెరాలు లాక్కుని మీడియా ప్రతినిధులను కొట్టటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తెలుగుదేశం హయాంలో రౌడీయిజం పెచ్చుపెరిగిందని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు.

ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు జరగటం అత్యంత హేయం. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement