ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల వసూళ్ల దందాకు అడ్డుకట్ట! 

Jagan Mohan Reddy Has Been  Announce The BC Declaration Assurance Along With Navaratna - Sakshi

సాక్షి, కర్నూల్‌(ఆదోని అర్బన్‌ ) : ‘‘సార్వత్రిక ఎన్నికలు తుదిఘట్టం చేరాయి. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు నాయుడూ మేనిఫెస్టో ప్రకటించారు. ఏ మాత్రం స్పష్టతలేని సీఎం మేనిఫెస్టోపై పెదవి విరుస్తున్న ప్రజలు జగన్‌ మోహన్‌రెడ్డి నవరత్నాలతోపాటు బీసీ డిక్లరేషన్‌ హామీలు మేళవింపుగా ప్రకటించడాన్ని హర్షిస్తున్నారు. ఓ వైపు సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందజేస్తామని చెబుతూనే గాడి తప్పిన పాలనను కట్టడి చేస్తామంటూ ప్రైవేట్, కార్పొరేట్‌ వసూళ్ల దందాను నియంత్రిస్తామన్న జగన్‌ ప్రకటను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోస పథకం కింద రైతులకు పెట్టుబడికి ఏటా రూ. 12,500 సాయం, వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్నివర్గాలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద ఏటా రూ. 15,000 సాయం, వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ మహిళలకు పింఛన్‌... కార్పొరేషన్‌ల ద్వారా రూ.    75, 000 ఉచితంగా సాయం, మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రోత్సాహకంగా రూ. 24,000 అందజేత,  కుల, చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డుతోపాటు సున్నా వడ్డీకే రూ. 10,000 తదితర వరాల జల్లులు కురిపించారు జగన్‌.

ప్రతి సామాజిక వర్గానికే ఇది చేయనున్నామని స్పష్టంగా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రతిపక్ష నేత ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల మితిమీరిన ఫీజుల వసూళ్లను నియంత్రిస్తామని ప్రకటించారు. అదేవిధంగా ప్రైవేట్‌ టీచర్ల స్థితిగతులు మెరుగు పరుస్తామన్నారు.  ఈ మేరకు ప్రత్యేకంగా రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని, నివేదిక నేరుగా సీఎంకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్న జగన్‌ మోహన్‌రెడ్డి హామీపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రులు నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు ఇలా’’...  

 బ్యాంకుల ద్వారా ఫీజులు చెల్లింపులు ఉండాలి 
ఫీజు నియంత్రణ చట్టం అమలులోకి రావాలంటే విద్యార్థుల ఫీజులు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి.  ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థలు దొంగ బిల్లులతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి.  ఫీజు నియంత్రణ చట్టం ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు.  ఫీజులు తగ్గించేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం సంతోషకరం.  ఫీజులు నియంత్రించగలిగితే రాష్ట్రం విద్యాభివృద్ధి చెందుతుంది.   
 – చంద్రశేఖర్, రిటైర్డ్‌ లెక్చరర్, ఆదోని  
 
ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి 
ఫీజు నియంత్రణ చట్టం ఉన్నా ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.  టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు కొమ్ముకాయడం మూలంగానే చట్టం అమలు కావడం లేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫీజులు తగ్గించేందుకు ప్రత్యేక కమిషన్‌ నియమిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం సంతోషకరం.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఫీజులు తగ్గించి చూపుతామన్న హామీని నమ్ముతున్నాం.    
– లోకేష్, న్యాయవాది, ఆదోని

 ఫీజుల నియంత్రణ అవసరం 
ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యలు విచ్ఛలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఈ దోపిడీని నియంత్రించే నాథుడే కరువయ్యారు.  తమ పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో ప్రైవేట్‌ స్కూళ్లలో చేర్పించి పేదలు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. మధ్యలో చదువు నిలిపేసిన సంఘటనలు లేకపోలేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫీజుల నియంత్రిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయం. ఆయన చేసి చూపుతారని నమ్ముతున్నాం.  
– కమలనాభ శర్మ, విద్యార్థి తండ్రి  
 
విద్యాభివృద్ధికి జగన్‌ చేయూత  
పేద, మధ్య తరగతి  పిల్లలు ప్రతి ఒక్కరూ చదివి ఉన్నత స్థాయికి చేరాలనే ఉద్దేశంతో జగన్‌ ప్రైవేట్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ కళాశాల ఫీజులు తగ్గిస్తామిని ప్రకటించారు. ఆయన నిర్ణయం చాలా మంచిది.  విద్యాభివృద్ధి చెందుతుంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలతో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యనభ్యశించి  స్థిరపడ్డారు.
– శంకర్, విద్యార్థిని తండ్రి 
 
చాలా మంచి నిర్ణయం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో బాగుంది. ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలల ఫీజు నియంత్రణ చేపడుతామని ప్రకటించడం చాలా మంచి నిర్ణయం.  రెగ్యులేటర్‌ కమిషన్‌  ఏర్పాటు చేస్తే ఫీజులు తగ్గే అవకాశం ఉంది. అదికూడా డైరెక్ట్‌గా ముఖ్యమంత్రికే  కమిషన్‌ నివేదిక అందజేయాలనే విధంగా చర్యలు తీసుకుంటామన్న నిర్ణయం అభినందనీయం.   
– ఈరన్న, రిటైర్డ్‌ డిప్యూటీ ఈఓ, ఆదోని  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top