పీఎఫ్ సొమ్ము జాడేదీ?

పీఎఫ్ సొమ్ము జాడేదీ?

  • ఆన్‌లైన్ చేయరు.. రుణాలడిగితే ఇవ్వరు

  •  అత్యవసరాల కోసం దరఖాస్తు చేసినా జాప్యమే

  •  జిల్లా పరిషత్ అధికారుల నిర్వాకం

  •  ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఇబ్బందులు

  • మచిలీపట్నం : జిల్లా పరిషత్ అధికారుల నిర్వాకంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల నుంచి ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్ మినహాయిస్తున్నా ఎంత మొత్తంలో తమ ఖాతాలో ఉందో చెప్పేవారే కరువయ్యారు. వివిధ జిల్లాల్లో పీఎఫ్ ఖాతాలు ఆన్‌లైన్ చేయగా కృష్ణాజిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదు. దీంతో జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఏ ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం సొమ్ము ఉందో తెలుసుకోవటమే కష్టంగా మారింది.



    జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు గత ఆరు నెలలుగా పీఎఫ్ సొమ్ము నుంచి రుణాలు ఇవ్వటం లేదు. ఇంట్లో శుభకార్యాలకు గాని, వైద్య ఖర్చులకు గాని పీఎఫ్ ఖాతాలోని సొమ్మును రుణంగా పొందే వెసులుబాటు ఉంది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ము ఆధారంగా వివిధ అవసరాల నిమిత్తం ఈ నిధి నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి చెల్లింపులు చేసే బాధ్యత జెడ్పీ డెప్యూటీ సీఈవోది. ఈ పోస్టు గత ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. ఈ ఆరునెలల వ్యవధిలో దాదాపు 700కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆరు నెలల వ్యవధిలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్ సొమ్ము అందనే లేదని చెబుతున్నారు.

     

    సమాధానం చెప్పే వారేరీ?

     

    జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 15 వేల మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ము వివరాలను తెలియజేసేందుకు ప్రత్యేక ఆపరేటర్‌ను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేశారు. ఎవరైనా ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో చెప్పాలని ఇక్కడకు ఫోన్ చేస్తే కంప్యూటర్ పనిచేయటం లేదని, వివరాలు అందుబాటులో లేవని సమాధానం చెబుతూ తప్పించుకుంటున్నారు. ఉదాహరణకు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో రూ.2 లక్షల నగదు ఉంటే అందులో లక్ష రూపాయల వరకు రుణం పొందే వెసులుబాటు ఉంది.



    వైద్య అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు తదితర అవసరాల వరకు 80 శాతం వరకు పీఎఫ్ సొమ్ము నుంచి రుణంగా అందించే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో ఈ వ్యవహారాలన్నీ చూడాల్సి ఉండగా ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో జెడ్పీ సీఈవో ఈ బాధ్యతలను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.



    పీఎఫ్ రుణం కోసం దూరప్రాంతం నుంచి జిల్లా పరిషత్‌కు వస్తే డెప్యూటీ సీఈవో పోస్టు ఖాళీగా ఉండటం, సీఈవో అందుబాటులో ఉండకపోవటంతో తమకు సమాధానం చెప్పేవారే కరువయ్యారని ఉద్యోగులు వాపోతున్నారు. రుణం కోసం దరఖాస్తు చేసుకుని ఒకటికి పదిసార్లు అధికారుల అనుమతి పొందినా ట్రెజరీలో హెడ్ ఆఫ్ ఎకౌంట్ రావాలని చెప్పి మరింత జాప్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.



    హెచ్‌ఎంలు, ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించేనా?

     

    జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ సొమ్ము ఖాతాల నిర్వహణ, రుణాల మంజూరు తదితర పనులు జిల్లా పరిషత్ అధికారులకు భారంగా మారటంతో ప్రభుత్వం ఈ బాధ్యతలను ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంలకు, మండలస్థాయిలో ఎంఈవోలకు అప్పగించింది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఆయా ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలు ముందుకు రావటం లేదు. పీఎఫ్ సొమ్ము నుంచి రుణాలు మంజూరు చేసే విధివిధానాలు తమకు తెలియవని వారు చెప్పి తప్పించుకుంటున్నారు.



    గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిన జెడ్పీ సీఈవో ఆయా ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం, ఎంఈవోలకు పీఎఫ్ సొమ్ము రుణాల మంజూరుకు సంబంధించి విధివిధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆ బాధ్యతను వారికి అప్పగించాల్సి ఉండగా ఇంతవరకు ఆ పని జరగలేదని ఉద్యోగులు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన సమయంలోనూ జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్ చేయకపోవటంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.



    ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకుండా, జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టును భర్తీ చేయకుండా, జెడ్పీ సీఈవో పట్టించుకోకుండా ఉండటంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇబ్బందుల పాలవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top