సొల్లు కబుర్లు ఆపండయ్యా..!

IT Minister Mekapati Goutham Reddy Is Outraged Over The Sacking Of 170 Locals - Sakshi

10వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమంటూ ప్రకటన

రెండేళ్లలో 1,200 ఉద్యోగాలిస్తే 170 మంది తొలగింపు

రూ.100కోట్ల విలువైన భూమి చౌకగా కొట్టేసిన సంస్థ

నాటి పేరు నేడు లేదు.. సెల్‌కాన్‌ స్థానంలో వింగ్‌టెక్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘తిరుపతి సెల్‌ఫోన్‌ ఉత్పత్లుల్లో అగ్రస్థానంలో నిలువనుంది. నెలకు 10లక్షల సెల్‌ఫోన్ల ఉత్పత్తే లక్ష్యం. ప్రారంభంలో 2,500 మందికి 2020 నాటికి ప్రత్యక్షంగా 10వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.150 కోట్లతో సెల్‌కాన్‌ సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. వారికి అనువుగా భూమి, నీరు, విద్యుత్, సౌకర్యాలు కల్పించాం. సెల్‌ఫోన్లతోపాటు, సెట్‌ టాప్‌ బాక్సులు, బ్యాటరీలు, చార్జర్లు, ఇయర్‌ ఫోన్లు, మైక్, స్పీకర్లు, కెమెరా ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ ఉత్పత్తి కానున్నాయి. తిరుపతిని ఎలక్ట్రానిక్‌ హబ్‌గా మారుస్తాం’’ అని 2017లో అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2017 జూన్‌ 22న ముఖ్యమంత్రి హోదాలో వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చౌకగా భూమిని కొల్లగొట్ట డమే అసలు ధ్యేయమని రూఢీ అవుతోంది. అందుకు అనుగుణంగానే పరిశ్రమ అడుగులు పడుతున్నాయని, అందులో భాగంగానే సెల్‌కాన్‌ స్థానంలో ‘వింగ్‌టెక్‌’ వచ్చి చేరిం దని పలువురు వివరిస్తున్నారు. ప్రారంభం నాటి మాటలు, ఆచరణలో కన్పించలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న పెద్ద మనుషులకు ఆచరణలో చిత్తశుద్ధి లోపించింది. 

ఉద్యోగాలు కల్పిస్తున్నామనే మాటున..
పరిశ్రమలతో పురోభివృద్ధి సహజం. ప్రభుత్వాలు ఆ మేరకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సరైందే. ఆ ముసుగులో కోట్లాది రూపాయాలు విలువైన భూమిని చౌకగా కొట్టేయాలనే అంతర్గత ఎత్తుగడలకు ఆస్కారం ఇవ్వడమే అభ్యంతరకరమని పలువురు విమర్శిస్తున్నారు. సెల్‌కాన్‌ కంపెనీకి రేణిగుంట సమీపంలో 16 ఎకరాల భూమి అప్పగించారు. ఎకరం రూ.25లక్షల చొప్పున రూ.4కోట్లకు కేటాయించారు. రూ.150కోట్లు పెట్టుబడితో ప్రత్యక్షంగా 10వేల మందికి పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. ప్రారంభంలోనే 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో చెప్పారు. 2020 నాటికి 10వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దాంతో బహిరంగ మార్కెట్‌లో రూ.100కోట్లు విలువైన భూమిని సెల్‌కాన్‌ సంస్థకు కేటాయించారు. ఆపై ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసిన సంస్థకు ఆచరణలో చిత్తశుద్ధి లోపించింది. రెండు విడతలుగా 1,200 మందిని తీసుకున్న ఆ సంస్థ తర్వాత 170 మందిని తొలగించింది. మరో ఏడాదిలో 9వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించే అవకాశం లేదనే పలువురు స్పష్టం చేస్తున్నారు. 

సెల్‌కాన్‌ స్థానంలో వింగ్‌టెక్‌
సెల్‌కాన్‌ సంస్థకు అత్యంత విలువైన భూమిని అప్పగించడం వెనుక అప్పటి మంత్రులు నారా లోకేష్, అమర్‌నాథరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పలువురు బాహాటంగా వెల్లడిస్తున్నారు. వినియోగానికి మించిన భూమి అప్పగించడానికి అదే కారణమని ఆరోపణలున్నాయి. పరిశ్రమ ముసుగులో విలువైన భూమి దక్కించుకోవడమే లక్ష్యంగా ఆ సంస్థ వ్యవహరించిందని పేర్కొంటున్నారు. ఆ మేరకు పరిశ్రమ నిర్మాణం అవసరానికి మించి భూకేటాయింపులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా నాడు సెల్‌కాన్‌ పేరుతో ఏర్పాటైన సంస్థ ప్రస్తుతం వింగ్‌టెక్‌గా మారింది. వింగ్‌టెక్‌తోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ సెల్‌కాన్‌ పేరుతో ఉన్న ఆ సంస్థ వింగ్‌టెక్‌గా మారడం వెనుక వ్యూహాత్మకత దాగిందని పలువురు వివరిస్తున్నారు. భవిష్యత్తులో సంస్థ యాజమాన్యం మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆరోపిస్తున్నారు. 

ఐటీ మంత్రి సీరియస్‌
సెల్‌కాన్‌ సంస్థలో స్థానికులను 170 మందిని తొలగించడంపై ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆ పరిశ్రమను సందర్శించిన మంత్రి సెల్‌కాన్‌ ప్రతినిధి గురు, వైస్‌ చైర్మన్‌ నరసింహన్, డైరెక్టర్లును నిలదీశారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని భావిస్తే ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. లక్ష్య సాధనలో ఎందుకు విఫలమయ్యారు, ఎప్పటికి పూర్తిస్థాయిలో విస్తరిస్తారు, ఉద్యోగాలు ఎప్పటికి దక్కుతాయని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పరిశ్రమల స్థాపనలో నాటి ప్రభుత్వ పెద్దల మాటలన్నీ సొల్లు కబుర్లేనని సెల్‌కాన్‌ సంస్థ ద్వారా రూఢీ అయ్యిందనే విమర్శలున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top