రాత్రికి రాత్రే కింగ్‌లా మారాలనుకుని... | IPL Cricket Bettings Going On In Prakasam | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: గుట్టుగా..బెట్టుగా..!

Apr 11 2018 9:06 AM | Updated on Apr 11 2018 9:06 AM

IPL Cricket Bettings Going On In Prakasam - Sakshi

వ్యాపారంలో అప్పులపాలైనవారు దురదృష్టం వెంటాడి ఉన్నదంతా కోల్పోయినవారు రాత్రికి రాత్రే కింగ్‌లా మారాలనుకొనేవారు పైలాపచ్చీసుగా తిరిగేవారు జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు... వీరందరికీ ఇప్పుడు ఐపీఎల్‌ క్రికెట్‌ పెద్ద లాటరీ టికెట్‌లా కనిపిస్తోంది  ఉన్న కాస్త డబ్బులను పందేల్లో పెడుతూ మరిన్ని కష్టాల్లో కూరుకు పోతున్నారు...

కందుకూరు రూరల్‌: ప్రస్తుతం ఐపీఎల్‌ ఫీవర్‌ పట్టుకుంది. వాస్తవానికి దీనిపై క్రీడాభిమానులు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఎక్కడైనా టీవీ ముందు నలుగురు కూర్చొని ఆసక్తిగా చూస్తున్నారంటే కచ్చితంగా అక్కడ బెట్టింగ్‌ రాజులు ఉన్నట్లే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వందలు వేలు దాటి కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. యువత లక్ష్యంగా కొందరు మధ్య వర్తులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై పోలీస్, ఇంటిలిజెన్స్‌ ని«ఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి.

తీవ్ర స్థాయికి..
గతంలో క్రికెట్‌ గెలుపోటములపై బెట్టింగులు పెట్టేవారు. గెలిచినవారు సొమ్ము చేసుకొని ఆనందించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పోయింది. వెంటనే నగదు కావాలనే ఆతృతతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. ఒక క్రీడాకారుడు ఐపీఎల్‌ మ్యాచ్‌లో 50 పరుగులు చేస్తాడని, ఒక ఓవర్లలో ఇన్ని పరుగులు చేస్తారని, ఈ బాల్‌ కచ్చితంగా ఫోర్‌ పోతుందని, సిక్స్‌ కొడతారని, రెండు పరుగులు మాత్రమే వస్తాయని ఇలా మధ్య వర్తులు రెచ్చగొట్టి మరీ పందెం పెట్టిస్తున్నారు.

అదే విధంగా మ్యాచ్‌ చివర మూడు, నాలుగు ఓవర్ల నుంచి బెట్టింగ్స్‌ అధికంగా జరుగుతున్నాయి. రూ. 100కి రూ. 200, రూ. 100కి రూ. 150 ఇలా కోట్లమేర లావాదేవీలు జరుగుతున్నాయి. 5 నుంచి 10 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రూమ్‌లు, గెస్ట్‌ హౌస్‌లలో ఈ బెట్టింగ్‌ వ్యవహారం జోరుగా సాగుతోంది. కొన్ని దుకాణాల్లో టీవీలు పెట్టుకొని బెట్టింగ్‌ సాగిస్తున్నారు.

కందుకూరులో ఐదుగురు బుకీలు?
ఆన్‌లైన్, ఫోన్ల ద్వారా బెట్టింగులు కొనసాగిస్తున్నారు. కందుకూరులో పెద్ద మొత్తంలో వ్యాపారం నడిపించే బుకీలు సుమారు ఐదుగురికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరు లక్షల్లో పెందేలు వేస్తున్నారు. మొత్తం మీద 15 బుకీ కేంద్రాలున్నట్లు తెలుస్తోంది. కొందరిని రంగంలోకి దించి వారికి ఆకర్షణీయమైన కమీషన్లు ఇచ్చి దందా కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌ అయితే  బెట్టింగ్‌ పాయింట్‌ నిర్వహిస్తున్న వారి ఖాతాతో ముందుగా నగదును జమ చేసి ఆన్‌లైన్‌ అకౌంట్లు ద్వారా లావాదేవీలు నడుపుతున్నారు. కొందరు బెట్టంగ్‌ నిర్వాహకులు కార్లు, ఆటోల్లో తిరుగుతూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిబారిన పడిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

వడ్డీ వ్యాపారులు.. తండావ్యాపారుల హవా
క్రికెట్‌ బెట్టింగ్‌ల వద్ద వడ్డీ వ్యాపారులు, తండా వ్యాపారులు తిష్ట వేస్తున్నారు. బెట్టింగ్‌లో చేయి తిరిగిన వారికి వెంటనే డబ్బులు ఇచ్చి గెలిస్తే అధిక మొత్తంలో వడ్డీ వస్తూలు చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోయి నగదు పోతే వెంటనే ప్రామిసరీ నోట్‌ రాయించుకుంటున్నారు. ఇలా వడ్డీకి తిప్పేవారి వ్యాపారం విరాజిల్లుతోంది.

చిత్తవుతున్న యువత
బెట్టింగ్‌ మోజులో పడిన యువతి చిత్తవుతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఎంబీఏ, డిగ్రీ చదివే విద్యార్థులు బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. చేతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇచ్చిన నగదుతో పాటు, బంగారు ఆభరణాలు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకొని మరీ బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఒక్కసారి పోయిన నగదును తిరిగి తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతూ చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఇలాంటివారే దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్, బైక్‌లు దొంగతనాలు వంటి కేసుల్లో చిక్కుకుంటున్నారు.

బెట్టింగ్స్‌లో తేడాలు వచ్చి సమయంలో ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. వీటిపై నిఘా ఉంచాల్సిన పోలీస్, ఇంటిలిజెన్స్‌ నిఘా వర్గం పూర్తిగా విఫలమయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఎవరైన సమాచారం ఇచ్చినప్పుడు దాడులు చేయడం ఆ తర్వాత వారి వద్ద ఎంతో కొంత వసూళ్లు చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement