
సాక్షి, అమరావతి: పెట్టుబడిదారులే వీఐపీలని, వారు దేశం కోసం పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎంఓయూలు కుదుర్చుకుని పరిశ్రమ స్థాపించే వరకు ఇబ్బందులు లేకుండా పారిశ్రామికవేత్తలను వీఐపీలుగా చూస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో ఏర్పాటు చేస్తున్న 75 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఇంజనీరింగ్ క్లస్టర్‌కు విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని రిమోట్ ద్వారా నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులను వీడియో ద్వారా పరిశీలించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశంలో 95 శాతం ఎంఎస్‌ఎంఈలే ఉన్నాయని చెప్పారు. భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి రేటు 1.60 శాతం ఉంటే ఏపీలో 8.05 శాతం ఉందని, మాన్యుఫ్యాక్చరింగ్‌లో 1.2 శాతం ఉంటే ఏపీ 8.83 శాతం అభివృద్ధి నమోదు చేసుకుందన్నారు. రాష్ట్రంలో వనరులకు కొదవలేదని, అయితే వాటిపై దృష్టి పెట్టడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. రెండు వేల సంవత్సరాల క్రితమే అమరావతి లాజిస్టిక్ హబ్‌గా ఉండేదని, ఇప్పటికీ భారతదేశంలో ఏపీనే కార్గో హబ్‌గా ఉందని సీఎం అన్నారు.