పేదల కోసమే ఇంగ్లిష్‌ మీడియం | Introducing English medium for the benefit of poor students says YS Jagan | Sakshi
Sakshi News home page

పేదల కోసమే ఇంగ్లిష్‌ మీడియం

Nov 20 2019 4:28 AM | Updated on Nov 20 2019 5:30 AM

Introducing English medium for the benefit of poor students says YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆ ఎంపీని పిలిచి గట్టిగా మందలించాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డికి ముఖ్యమంత్రి సూచించారని సమాచారం. పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. 

రాజకీయ దురుద్దేశాలతోనే దుష్ప్రచారం
ప్రతిపక్ష పార్టీలు, కొందరు పత్రికాధిపతులు రాజకీయ దురుద్దేశాలతో ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఆ ప్రతిపక్ష నేతలు, పత్రికాధిపతుల పిల్లలు, మనవళ్లు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇంగ్లీష్‌ మీడియం అన్నది ధనిక వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదని, పేద–మధ్య తరగతి వర్గాలకూ చేరువ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు..
ఇంగ్లీషు మీడియంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల జీవితాలు మారతాయని గట్టిగా విశ్వసిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. అన్ని విధాలుగా చర్చించాకే  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రభుత్వ విధానం సుస్పష్టంగా ఉందని చెబుతూ అందుకు వ్యతిరేకంగా పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘనే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా వెనకాడేది లేదని గట్టిగా చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement