ఆశల దీపం ఆరిపోయింది..!


 బూర్జ: ఆ విద్యార్థి బూర్జ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మండలానికే ప్రథముడిగా నిలిచాడు.. తమ పిల్లడు బాగానే చదువుతున్నాడన్న ఆ కుటుంబం ఆనందం ఎంతో కాలం నిలువలేదు.. టైఫాయిడ్ పుణ్యమా అని వారి ఆశల దీపం ఆరిపోయింది.. దీంతో తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు.. వివరాలిలా ఉన్నాయి...  మండలంలోని తోటవాడ గ్రామానికి చెందిన కోనాడ కృష్ణ (17) శుక్రవారం అర్థరాత్రి టైఫాయిడ్ జ్వరంతో శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కోనాడ జయమ్మ, త్రినాథరావు బోరున విలపిస్తున్నారు. మా ఆశల దీపం ఆరిపోయిందని వారు కన్నీరు మున్నీరయ్యారు.

 

 వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కృష్ణకు స్థానికంగా వైద్యసేవలందక ప్రైవేటు వైద్యం పొందలేక తమ కొడుకును చేతులారా చంపేసుకున్నామని వారు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడిపెట్టించింది.  జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి పరిస్థితి విషమించడంతో తప్పనిసరి పరిస్థితిలో  ఈనెల 9న శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కోనాడ జయమ్మ, త్రినాథరావులకు  ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రాముడు,లక్ష్మణ అనే ఇద్దరు కవ లలు   మూగవారు కావడంతో మరో కుమారుడు కృష్ణపై వారు ఆశలు పెట్టుకున్నారు.  తమతోపాటు మూగపిల్లలకు కూడా ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి.  కోనాడ కృష్ణ మృతి చెందిన విషయం తెలుసుకుని ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు ఆ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.

 

 పారిశుద్ధ్య లోపమే విద్యార్థిని బలితీసుకుంది ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ కాలనీ వాసులు

  బూర్జ:  గ్రామంలోని పారిశుద్ధ్య లోపమే అభం శుభం తెలియని  విద్యార్థి కోనాడ కృష్ణను బలి తీసుకుందని తోటవాడ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు శనివారం పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు, ఏఎన్‌ఎం అరుణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  గత నెల 12 నుంచి  నెల రోజులుగా గ్రామంలో ప్రతి ఇంటిలో జ్వరాల బారిన పడి బాధపడుతున్నా పంచాయతీ అధికారులు గాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  కాలనీలో ఒక్క బోరు కూడా లేకపోవడంతో బావినీరే తాగుతున్నామని, ఆ నీరు కలుషితమైందని వైద్య సిబ్బంది పరీక్షలో నిర్థారణ అయినప్పటికీ బావి నీరు తాగవద్దని తమకు తెలియజేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారన్నారు.  

 

 కాలనీకి వెళ్లే రోడ్డుపై పంట కుప్పలు, మలమూత్ర విసర్జనతో నిండి దుర్గంధం అలముకుంటోందని ఆవేదన చెందారు. పెంటకుప్పలను తొలగించాలని ఇటీవల గ్రామాన్ని సందర్శించిన జేసీ ఆదేశించినప్పటికీ  ఆఆదేశాలు బేఖాతర్ చేశారని విమర్శించారు. ఆ కుటుంబానికి ఆధారమైన యువకుడు మరణించడంతో ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని వారు అధికారులను నిలదీశారు. ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, తహశీల్దార్ బాబ్జీరావు, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు గుమ్మిడి రాంబాబు అక్కడకు చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే గ్రామంలో వైద్య సేవలందించాలని ఎంపీపీ సూర్యారావు డాక్టర్ ప్రనన్నకుమార్‌కు ఆదేశించారు. పెంటకుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో దళితులు శాంతించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top