కార్పొరేట్ చదువొద్దు | Inter student commits suicide | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ చదువొద్దు

Oct 19 2013 3:17 AM | Updated on Nov 9 2018 4:36 PM

కార్పొరేట్ చదువులతో మానసిక ఒత్తిడికి గురై ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

మందమర్రి రూరల్/రామగుండం, న్యూస్‌లైన్ : కార్పొరేట్ చదువులతో మానసిక ఒత్తిడికి గురై ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు గొప్పవాడు కావాలని కలగన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయాడు. మందమర్రిలోని యాపల్‌కు చెందిన బొద్దుల కల్యాణ్‌కుమార్(19) శుక్రవారం రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, కళాశాల వాతావరణంలో ఇమడలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్ నోట్ రాసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కల్యాణ్‌కుమార్ మందమర్రిలోనే పదో తరగతి వరకు చదువుకున్నాడు.
 
 తల్లిదండ్రులు రాజేశ్వరి, ఫణికుమార్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్  ఎంపీసీలో చేర్పించారు. శ్రీరాంపూర్ సింగరేణి కాలరీస్ డివిజన్‌లో సెక్యూరిటీ వింగ్‌లో ఫణికుమార్ పనిచేస్తున్నారు. కాగా.. కల్యాణ్‌కుమార్‌కు కళాశాలలో చేరినప్పటి నుంచి అక్కడి వాతావరణం నచ్చడం లేదని, తాను అక్కడ చదువుకోలేనని పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పాడు. వేలకు వేలు ఫీజులు చెల్లించామని, మధ్యలో చదువు మానేస్తే ఎలా అంటూ వారు అతడిని బుజ్జగించి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్‌కుమార్ మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇటీవల దసరా సెలవులు రావడంతో ఇంటికి వచ్చాడు. ఇక తాను కళాశాలకు వెళ్లబోనని ఇంట్లో చెప్పాడు. ఈ ఒక్క ఏడాది చదువుకో అని, ఆ తరువాత నీకు ఇష్టమైన కళాశాలలోనే చదువుకొందువని తల్లిదండ్రులు నచ్చచెప్పారు. మనసులో ఇష్టం లేకున్నా సరేనన్న కల్యాణ్‌కుమార్ శుక్రవారం కళాశాలకు బయల్దేరాడు. బ్యాగులో బట్టలు సర్దుకొని, తన సంబంధీకుల ఫోన్ నంబర్ల లిస్టును దగ్గర పెట్టుకొని భాగ్యనగర్ రైలు ఎక్కాడు. అప్పటికే కళాశాలకు వెళ్లవద్దని బలమైన నిర్ణయం తీసుకున్న అతను ఎటు వెళ్లాలో తెలియక రెలు రామగుండం రైల్వేస్టేషన్‌లో ఆగగానే దిగాడు. అదే సమయంలో న్యూఢిల్లీకి వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్ రైలు రైల్వేస్టేషన్‌లోకి చేరుకుంటున్న క్రమంలో ఎదురుగా వెళ్లి దాని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 మృతదేహాన్ని తీయడంలో నిర్లక్ష్యం
 రైల్వే స్టేషన్‌లో ఉదయం ఆరు గంటలకు ఆత్మహత్య చేసుకున్న కల్యాణ్‌కుమార్ మృతదేహాన్ని పట్టాలపై నుంచి తీయడంలో రైల్వే పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.  దీంతో మృతదేహంపై నుంచే రైళ్లు వెళ్లడం కలచివేసింది. మృతదేహాన్ని తీసేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులే మృతదేహాన్ని తీసే ప్రయత్నం చేశారు.  రైళ్లు వస్తూ పోతుండడంతో సాహసించలేకపోయారు. సంఘటన జరిగిన రెండు గంటలకు జీఆర్పీ పోలీసులు వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలు బాదుకుంటూ వచ్చి కొడుకు మృతదేహంపై పడి రోదించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి కాంతారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement