నిర్లక్ష్యపు గండి | intensity of the flow of water washed the road | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు గండి

Nov 19 2015 12:27 AM | Updated on Aug 30 2018 5:49 PM

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది మన అధికారులు తీరు. మురుగు తూములున్న చోట కల్వర్టులు ....

నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన రహదారి
నగరం-కారంకివారిపాలెం మధ్య నిలిచిన రాకపోకలు
మురుగు తూములున్న చోట కల్వర్టులు నిర్మించని ఫలితం
 ముందే హెచ్చరించినా పెడచెవిన పెట్టిన అధికారులు

 
నగరం :  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది మన అధికారులు తీరు. మురుగు తూములున్న చోట కల్వర్టులు నిర్మించండి మాహాప్రభో అని రోడ్డు నిర్మాణ సమయంలోనే అధికారులకు విన్నవించినా వారి చెవికెక్కలేదు. ఫలితంగా రెండు నెలల కిందట నిర్మించిన రోడ్డు కోతకు గురై తెగిపోయింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తీరిగ్గా వచ్చి మరమ్మతులు చేపట్టాలంటూ సిబ్బందిని ఆదేశించి వెళ్లారు.

మండల కేంద్రం నగరం నుంచి కారంకివారిపాలెం వెళ్లే మార్గంలో రెండు నెలల కిందట బీటీ రోడ్డు నిర్మించారు. రహదారి కింద ఉన్న మురుగుతూములకు కల్వర్టు నిర్మించలేదు. దీంతో తూములున్న చోట క్రమంగా రోడ్డు కోతకు గురైంది. నాలుగురోజులుగా అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు నీటి ఉధృతి పెరగడంతో బుధవారం ఉదయం కారంకిపాలెం వద్ద రోడ్డుకు గండిపడి పూర్తిగా తెగిపోయింది. దీంతో కారంకివారిపాలెం, అద్దంకివారిపాలెం, తోటపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారికి మరోవైపున పంటకాల్వల ఉండటంతో పంటలకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు.

పంటకాల్వపై వేసిన విద్యుత్‌స్తంభాల మీదుగా పాదచారులు మాత్రమే ప్రయాణించగలుగుతున్నారు. ఈ మార్గంలోనే మరో మూడు మురుగు తూములున్నాయి. వీటి వద్ద రోడ్డు కోతకు గురువుతోంది. ఇవి కూడ తెగే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు వేసే ముందే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని, అప్పుడే కల్వర్టులు నిర్మించి ఉంటే ఇలాంటి ప్రమాదాలకు తావుండేది కాదని అంటున్నారు. నీటి ప్రవాహ ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయిందన్న విషయం తెలుసుకుని తెనాలి ఆర్డీవో కె.నరసింహులు, పీఆర్ ఈఈ సుబ్రమణ్యేశ్వరరావులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే రహదారి మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులతో చర్చించి రహదారి కోతకు గురవకుండా పటిష్ట చర్యలు చేపడతామని గ్రామస్తులకు హమీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్ దారం వెంకటేశ్వరరావు, డీటీ వెంకటేశ్వరరావు, పీఆర్‌ఏఈ షేక్ పిరోజ్‌లాల్, టీడీపీ స్థానిక నేత విచారపు రాఘవయ్య డ్రైనేజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement