'బీమా క్లెయిమ్ చెల్లింపుల్లో జాప్యం తగదు'

'బీమా క్లెయిమ్ చెల్లింపుల్లో జాప్యం తగదు' - Sakshi


న్యూఢిల్లీ:  క్లెయిమ్‌ల చెల్లింపుల్లో ప్రైవేటు బీమా కంపెనీలు తీవ్ర జాప్యం చేస్తున్నాయని, నిరాకరణకు గురవుతున్న క్లెయిమ్‌ల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన లోక్‌సభలో ఇన్సూరెన్స్ లా(సవరణ) బిల్లు, 2015పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘స్థాయీ సంఘం చేసిన సిఫారసులను పరిశీలించాను. ఎఫ్‌డీఐ పరిమితి పెంచుతూ తీసుకున్న నిర్ణయం సంతోషకరం. దేశానికి ఈ పరిణామం మేలు చేస్తుంది. బీమా కంపెనీల క్యాపిటల్ అవసరాల కోసం ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. విదేశీ బీమా కంపెనీలు పాలసీదారుకు చెందిన పెట్టుబడులను ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ విదేశాల్లో పెట్టకుండా నిరోధించడం మేలు చేస్తుంది.



ఆరోగ్య బీమా కంపెనీల క్యాపిటల్‌ను రూ. 100 కోట్లకు బదులుగా రూ. 50 కోట్లకు తగ్గించడం కూడా కంపెనీల రాకను ప్రోత్సహిస్తుంది. అయితే ప్రైవేటు కంపెనీలు బీమా క్లెయిమ్‌ల చెల్లింపులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. క్లెయిమ్‌ల చెల్లింపులో జాప్యం చేయడం, నిరాకరించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టిపెట్టాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రైవేటు కంపెనీల రాకతో తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో బీమా డిమాండ్ ఏటా 18 శాతం పెరుగుతోంది. ఇక్కడ ఎల్‌ఐసీ పాత్రను పెంచాలి. ప్రైవేటు బీమా కంపెనీలు వృద్ధి కనబరుస్తుండగా ఎల్‌ఐసీ తిరోగమనంలో పయనిస్తోంది. అందువల్ల దాని పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. బీమారంగంలోకి 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో దేశంలో బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top