జమ్మూలో రాష్ట్ర జవాను మృతి | Indian jawan killed as Pakistan violated ceasefire twice on Tuesday | Sakshi
Sakshi News home page

జమ్మూలో రాష్ట్ర జవాను మృతి

Oct 17 2013 2:54 AM | Updated on Sep 1 2017 11:41 PM

జమ్మూలో రాష్ట్ర జవాను మృతి

జమ్మూలో రాష్ట్ర జవాను మృతి

పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన జవాను మృతి చెందారు.

హైదరాబాద్/నారాయణపేట/న్యూస్‌లైన్: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన జవాను మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ మృతి చెందారు. మంగళవారం పూంచ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంటకు చెందిన ఫిరోజ్‌ఖాన్ (36)... గత 18 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయన మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. నవాబ్ సాహెబ్ కుంటలో ఫిరోజ్‌ఖాన్ తల్లి అక్తర్ బేగం, భార్య నస్రీన్ బేగం, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. ఫిరోజ్‌ఖాన్ తండ్రి జాఫర్‌ఖాన్ కూడా ఆర్మీలో జవానుగా పనిచేసి రిటైరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన వీరి కుటుంబం.. జాఫర్‌ఖాన్ రిటైర్ అయిన తర్వాత వరంగల్‌కు వెళ్లింది. అనంతరం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.
 
 హైదరాబాద్ చేరుకున్న భౌతికకాయం..
 ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయం బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. గురువారం అధికార లాంఛనాలతో నవాబ్‌సాబ్‌కుంట ముస్లిం శ్మశాన వాటికలో ఫిరోజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఫిరోజ్‌ఖాన్ మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
 
 బక్రీద్‌కు రాలేకపోతున్నా..  పిల్లలు జాగ్రత్త
 ‘‘పిల్లలు జాగ్రత్త. బక్రీద్‌కు ఇంటికి రాలేకపోతున్నాను. బోర్డర్‌లో డ్యూటీ వేశారు. ఇంకొద్దిసేపట్లో వెళ్లాలి. ఇప్పుడు నీ అకౌంట్‌లో డబ్బులు వేశాను. పండక్కి  కావాల్సినవి కొనుక్కోండి. అమ్మ, నువ్వు, పిల్లలు సంతోషంగా బక్రీద్ జరుపుకోండి. ఎక్కువ సేపు మాట్లాడేందుకు టైం లేదు. వెళ్తున్నాను. బై..’’ తన భార్య నస్రీన్‌తో ఫిరోజ్‌ఖాన్ చివరి మాటలివి. నాలుగురోజుల క్రితం సరిహద్దు ప్రాంతానికి బయలుదేరే ముందు ఆయన తన భార్యతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత రెండ్రోజులకే అసువులు బాశారు. రంజాన్‌కు ఇంటికి వచ్చాడని, బక్రీద్‌కు రావడం వీలుకావడం లేదని, తర్వాత వస్తానని చెప్పాడని, ఇంతలోనే దారుణం జరిగిపోయిందని ఫిరోజ్ ఖాన్ తల్లి, భార్య పెద్దపెట్టున రోదించారు. మరికొద్ది నెలల్లో రిటైర్మెంట్ పూర్తి చేసుకొని రావాల్సిన భర్త ఇలా శవమై వస్తాడనుకోలేదంటూ నస్రీన్ విలపించడం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నా రు. 15వ బీహార్ రెజిమెంట్‌లో హవల్దార్‌గా పనిచేస్తున్న ఫిరోజ్ చెల్లెలు 8 నెలల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఫిరోజ్ చనిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement