
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆస్తులపై ఐటీæ శాఖ రెండవరోజు శనివారం కూడా ఐటీ దాడులు కొనసాగాయి. శుక్రవారం జరుగుమల్లి మండలం కె. బిట్రగుంటలోని ఎమ్మెల్యేకు చెందిన సదరన్ ఇన్‌ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు జిల్లాలోని పలు సంస్థలపైనే కాక గుంటూరు విజయవాడల్లోని పోతులకు చెందిన ఐదు కంపెనీల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శనివారం సైతం పోతుల కంపెనీలలో సోదాలు నిర్వహించారు. శనివారం ప్రధానంగా విజయవాడలోని పోతుల రామారావుకు చెందిన సదరన్ డెవలపర్స్ రియలెస్టేట్ కంపెనీలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పోతుల సమీప బంధువు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించినట్లు తెలుస్తోంది. పోతుల తన కంపెనీ ద్వారా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.