సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదాయ పన్ను శాఖ(IT) సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లు.. వాటి చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్యాక్స్ మోసాలతో పాటు బినామీ ఆస్తులనూ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
నగరంలోని పిస్తా హౌజ్, షా గౌస్ హోటల్స్, మెహిఫిల్.. ఇలా పలు బిర్యానీ హోటళ్ల మెయిన్ బ్రాంచ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ ,మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే మైహిఫిల్ రెస్టారెంట్‌లలో.. ఓనర్ ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. షేక్‌పేటలోని మెహిఫిల్ రెస్టారెంట్‌పై తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులకు రికార్డులను పరిశీలించి కంగుతిన్నారు. రెస్టారెంట్‌లో పని చేసే వర్కర్‌లే బినామీలని.. వాళ్ళ పేరు మీదే ప్రాపర్టీలు ఉన్నాయని గుర్తించారు.
సిటీలోనే కాదు.. బయటి దేశాల్లోనూ ఈ రెస్టారెంట్‌లకు బ్రాంచిలు ఉన్నాయి. సంవత్సరంలో వందల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి. అదే సమయంలో.. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్‌జాక్షన్స్ జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల్లో ట్యాక్స్ రికార్డుల్లో చూపిన ఆదాయానికి.. వచ్చిన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ట్యాక్స్ చెల్లింపుల్లోనూ వ్యత్యాసాలు బయటపడ్డాయి.

ఇదీ చదవండి: ఐ బొమ్మ జస్ట్ పైరసీ కాదు.. అంతకు మించి!


