రియల్‌బూమ్‌లో కోట్లు సంపాదించినా, సర్కార్‌కు పన్ను కట్టని వ్యాపారులపై ఇన్‌కంటాక్స్ అధికారులు దృష్టి సారించారు.
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: రియల్‌బూమ్‌లో కోట్లు సంపాదించినా, సర్కార్‌కు పన్ను కట్టని వ్యాపారులపై ఇన్‌కంటాక్స్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికీ ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసుకున్న ఐటీ అధికారులు మంగళవారం సిద్దిపేటలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి సోమసుందరయ్య ఇంటిపై దాడి చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సోదాలు నిర్వహించారు. సోమసుందరయ్య సిద్దిపేటతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆయా భూముల పత్రాలను పరిశీలించారు. ఆయన ఐటీ శాఖకు సమర్పించని సమాచారాన్ని పకడ్బందీగా సేకరించారు. సిద్దిపేట ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ పద్మలత నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ శాఖ ప్రతినిధులు సోదాల్లో పాల్గొన్నారు.
సోమసుందరయ్య ఇంట్లోని ఆస్తుల డాక్యుమెంట్లను, ఇతర ఆస్తుల వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిమిషాల్లోనే ఈ వార్త బయటకు పొక్కడంతో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు తెలిసిన అధికారులతో సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారు. గత నెల ఫెర్టిలైజర్ షాపులపై దాడులు చేసిన ఐటీ అధికారులు, ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దృష్టి సారించడంతో స్థానికులంతా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఐటీ అధికారులు మాత్రం ఐటీశాఖకు లెక్కలు చూపకుండా పన్ను ఎగ్గొట్టిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులపై మున్ముందు దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.