
వెంకన్న సన్నిధిలో నామాల పంచాయితీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నామాల గొడవ మళ్లీ రాజుకుంది...
- ముదురుతున్న అర్చకులు, జీయర్ల పోరు
- ఓ అర్చకుడిని తప్పించిన అధికారులు
- అభ్యంతరం తెలిపిన ప్రధాన అర్చకుడు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నామాల గొడవ మళ్లీ రాజుకుంది. ఆలయంలోని గర్భాలయ మూలమూర్తికి అలంకరించిన తిరునామంపై ఉద్దేశపూర్వంగా నామాన్ని మార్చినట్టు వచ్చిన ఫిర్యాదులతో ఓ అర్చకుడిపై ఇటీవల టీటీడీ అధికారులు వేటువేశారు. దీంతో వైష్ణవ తెగల్లోని ‘తెంగలై, వడగలై’ అనే రెండు వర్గాల మధ్య అంతర్గత వివాదం మళ్లీ రేగింది. అవకాశం దొరికితే ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోటీ పడే ఈ తెగ మధ్య.. గతంలో మహారథంపై అలంకరించే తిరునామం విషయంలో దుమారమే రేపింది. నామం విషయంలో కోర్టు వివాదాలు నడిచిన సందర్భాలున్నాయి.
టీటీడీ ప్రతిష్టపై నామాల వివాదం?
ఆలయంలో తెంగలై, వడగలై వైష్ణవ తెగల్లో తిరునామానికి ఎంతో విశిష్టత ఉంది. ఇందులో వడగలై వారు ఆంగ్లం లోని ‘యు’ ఆకారంలో ఊర్ధ్వపుండ్రాలు (నామం) దిద్దుకుంటారు. మరొక తెగలోని తెంగలై వారు ‘వై’ ఆకారంలో తిరునామం ధరిస్తారు. నుదుటపై దిద్దుకున్న నామాన్ని బట్టి వైష్ణవ తెగలను గుర్తించవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి తిరునా మం ఆ రెండు తెగలకు సంబంధం లేకుం డా ఉంటుంది. ‘‘యు, వై ’’ ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరంలో ‘ప’ పోలి ఉంటుంది. దీన్నే ఆగమబద్ధంగా ‘తిరుమణికావు’ అని అంటారు.
పొరపాట్లు లేవు: రమణదీక్షితులు
‘వైఖానస ఆగమం ప్రకారం తిరుమల ఆలయంలో గర్భాలయ మూలమూర్తికి కైంకర్యారాధనాలు, అలంకరణలు జరుగుతున్నాయి. అందులో ఎలాంటి పొరపాట్లు లేవు’ అని ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన ఏవీ రమణదీక్షితులు మీడియాతో అన్నారు. వైఖానస ఆగమ శాస్త్ర పరిజ్ఞానం లేనివారే ఆరోపణలు చేస్తుంటారని విమర్శించారు. అర్చకులను విధులను తప్పిం చడంపై కోర్టుకు వెళతామన్నారు.