ఆశల సాగు | In this time, 30 thousand hectares of rice cultivation | Sakshi
Sakshi News home page

ఆశల సాగు

Jun 23 2016 2:11 AM | Updated on Sep 4 2017 3:08 AM

మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఖరీఫ్ ప్రారంభంలోనే వరుణుడు పలకరించడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

కరుణించిన వరుణుడు
ఊపందుకున్న వ్యవసాయ పనులు
వేరుశనగ, వరి నాట్లలో బిజీబిజీ

 

 

మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఖరీఫ్ ప్రారంభంలోనే  వరుణుడు పలకరించడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే 40వేల హెక్టార్లలో వేరుశనగ విత్తగా, మరో 30వేల హెక్టార్లలో వరి నాట్లు వేసేందుకు సన్నద్ధమయ్యారు. చెరుకు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగుకూ దుక్కులు సిద్ధం చేస్తున్నారు.

 

చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. పది రోజుల కిందట కురిసిన వర్షాలకు సిద్ధమైన దుక్కుల్లో వేరుశనగ విత్తడం మొదలు పెట్టారు. మరికొన్ని చోట్ల అడుసు దుక్కులు సిద్ధం చేసి నాట్లువేసేందుకు సమాయత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 2.11 లక్షల హెక్టార్ల వరకు సాగుచేయాల్సి ఉంది. వ ర్షాధార వాణిజ్య పంటగా 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ, 75 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేస్తారు.


ఊపందుకున్న వేరుశనగ విత్తే పనులు
వేరుశనగ పంట అత్యధికంగా పడమటి మండలాల్లో సాగవుతోంది. ఈ నెల మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో దుక్కులు సిద్ధం చేశారు. ఇందుకు తగ్గట్టుగా ఖరీఫ్ ప్రారంభంలోనే వ్యవసాయశాఖ అధికారులు సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు 75 వేల క్వింటాళ్ల వరకు పంపిణీ చేయడంతో రైతులు దాదాపు 40 వేల హెక్టార్లలో వేరుశనగ విత్తేశారు. ఆ తర్వాత రెండు వారాలపాటు వర్షాలు కనుమరుకు కావడంతో వ్యవసాయ పనులు కొంత మందగించాయి.

 
మళ్లీ చిగురించిన ఆశ

నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.  రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వేరుశనగతోపాటు వివిధ పంటల సాగుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే సిద్ధంగా ఉన్న దుక్కుల్లో వేరుశనగ విత్తడం మొదలు పెట్టారు. దీంతోపాటు వివిధ రకాల పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు.

 
30వేల హెక్టార్లలో వరి సాగు

జిల్లాలో వరి సాగుకు రైతులు అత్యధికంగా మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్‌లో 13 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరి సాగుచేయాల్సి ఉండగా ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో దాదాపు 30 వేల హెక్టార్లలో వరినాట్లు వేసేందుకు సిద్ధమైనట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 40 వేల హెక్టార్లలో చెరుకు, కూరగాయలు, చిరుధాన్యాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement