ఈ ఏడాది వానలే.. వానలు! 

IMD Says That annual rainfall registers 96 percent this year - Sakshi

రైతులకు ఆశాజనకంగా వానాకాలం

జూన్‌ మొదటి వారంలో నైరుతి వస్తుందని అంచనా

96 శాతం వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ

సాక్షి, అమరావతి/విశాఖపట్టణం: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీపి కబురు అందించింది. జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈసారి ఎలా ఉంటాయన్న దానిపై మొదటి ముందస్తు అంచనాలను సోమవారం ప్రకటించారు. రుతుపవనాలు రాయలసీమకు జూన్‌ 3–4 తేదీల మధ్య ప్రవేశించే అవకాశముందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ రైతులకు లాభసాటిగా ఉంటుందని.. మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు. జూన్‌–సెప్టెంబర్‌ మధ్య నైరుతి రుతుపవనాల కాలం ఉంటుందని, 50 ఏళ్ల సరాసరి అంచనాల ప్రకారం ఈసారి 96 శాతం వర్షపాతం రాష్ట్రంలో నమోదవుతుందని తెలిపారు. దీనికి అటుఇటుగా ఐదు శాతం తేడా ఉంటుందన్నారు. వచ్చే జూన్‌ మొదటి వారంలో విడుదల చేయబోయే రెండో అంచనా నివేదిక ఇంకా స్పష్టంగా, ప్రాంతాల వారీగా ఉంటుందని చెప్పారు. ఈసారి నైరుతి రుతుపవనాల ద్వారా పడే వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుందన్నారు.  

అటు నిప్పులు.. ఇటు పిడుగులు
రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితి నెలకొంది. రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ సాధారణకంటే 3–4 డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి. కోస్తాంధ్రలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో వడగాడ్పులు ప్రభావం చూపాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం, జంగమహేశ్వరపురం (రెంటచింతల)లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 42, నందిగామ, తిరుపతిల్లో 41, తుని, గన్నవరం, అమరావతిలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే.. ఈ వారంలో ఎండలు విపరీతంగా పెరుగుతాయని ఇస్రో, ఇతర జాతీయ సంస్థలు అంచనా వేసినట్టు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సోమవారం ప్రకటించింది. వచ్చే ఐదారు రోజుల్లో కొన్నిచోట్ల 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటితే వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

ఎల్‌నినో బలహీనం.. 
ఎల్‌నినో, లానినోలపైనా వర్షాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు. అయితే ఒక్కోసారి వాటితో సంబంధం లేకుండా కూడా వర్షాలు వస్తాయని చెప్పారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఎల్‌నినో మరింత బలహీనంగా ఉంటుందన్నారు. పసిఫిక్‌ మహా సముద్రంలో భూమధ్య రేఖ దగ్గర సముద్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని లానినో అంటారు. ఎల్‌నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లానినో వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top