
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని శుక్రవారం వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మరింత బలపడి కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతవరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.