చలానా తెగుద్ది! | I get pocket hole | Sakshi
Sakshi News home page

చలానా తెగుద్ది!

Oct 4 2013 1:07 AM | Updated on Aug 21 2018 5:44 PM

జిల్లాలో పోలీసులను చూస్తే వాహనచోదకులు హడలిపోతున్నారు. మోటార్‌సైక్లిస్ట్ నుంచి ఆటోలు, మ్యాక్సీక్యాబ్‌ల నిర్వాహకుల వరకు అంతా బెంబేలెత్తిపోతున్నారు.

సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో పోలీసులను చూస్తే వాహనచోదకులు హడలిపోతున్నారు. మోటార్‌సైక్లిస్ట్ నుంచి ఆటోలు, మ్యాక్సీక్యాబ్‌ల నిర్వాహకుల వరకు అంతా బెంబేలెత్తిపోతున్నారు. అదేమంటే పోలీసులు దారికాచి చలానాలు రాస్తున్నారని చెబుతున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సర్వశక్తులు ధారపోసే పోలీసులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేపెట్టేందుకు శక్తియుక్తులు ప్రయోగిస్తున్నారు. దీనికోసం స్టేషన్లవారీగా టార్గెట్లు కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

సమైక్యాంధ్ర పరిరక్షణ  ఉద్యమంలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాలుపంచుకోవడంతో ప్రభుత్వానికి పన్నులు రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడింది. ఈ క్రమంలో పోలీసులపై ఇప్పుడు వసూళ్ల భారం పడింది. కనీసం పోలీసుల రవాణాఖర్చులు, జీతాలకైనా వస్తాయనుకున్నారో ఏమోకానీ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో పోలీస్ స్టేషన్లవారీగా టార్గెట్లు పెట్టారు.

విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు, 49 మండలాల్లో ఇప్పుడు పోలీసులు కేసులు కట్టి చలానాలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ తదితర కాగితాలు లేకపోవడం వంటి వాటిని చూపి చలానాలు రాస్తున్నారు. ఇలా ఒక్కో స్టేషన్ పరిధిలో రోజుకు ఆరేసి కేసులు రాయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో పలువురు ఎస్.ఐ.లు అసలు విధులు పక్కనపెట్టి జరిమానాల వసూళ్లతోనే కాలం వెళ్లబుచ్చాల్సివస్తోంది. ఈ కేసుల్లో అప్పటికప్పుడే రూ.100 నుంచి రూ. 2 వేలు వరకు చలానా రాసి వసూలు చేసే అవకాశం ఉండటంతో వాహన చోదకులు హడలిపోతున్నారు.

 అన్నీ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లేనా?

 జిల్లాలో పోలీసులు రాస్తున్న చలానాలను పరికిస్తే గత కొద్ది రోజులుగా అన్నీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ (రాష్ డ్రైవింగ్) లేనా.. అనే అనుమానం కలుగుతోంది. చలానాలు రాసి అధిక మొత్తంలో జరిమానాలు వసూలు చేయడానికి పోలీసులు మద్యం షాపుల సమీపంలోని ప్రధాన రహదారులపై మాటు వేస్తున్నారు. మద్యం షాపులో ఇలా మద్యం తాగి బైక్, ఆటోలపై అలా రోడ్డుపైకి రాగానే వల వేసి పట్టేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనాన్ని నడపడం) కారణంతో చలానాను తెగ్గోస్తున్నారు.

వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిని పరీక్ష చేసి ఆధారాలతో కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమైక్య ఆందోళనల నేపథ్యంలో కోర్టులకు కూడా న్యాయవాదులు హాజరుకావడం లేదు. దీంతో ఈ కేసుల్ని కోర్టుకు పెడితే జరిమానా విధించడం జాప్యం జరుగుతుందనుకున్న పోలీసులు అటువంటి వాటిని కూడా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతున్నట్టుగానే చూపిస్తూ చలానాలు రాసి జరిమానాలు వసూలుచేయడం ఆశ్చర్యపరిచే అంశం. ఏది ఏమైనా పోలీసులకు అదనపు భారం పడినట్టే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement