అనుమానం పెనుభూతమై..

ఆలిని కడతేర్చిన భర్త

వివాహిత అనుమానాస్పద మృతిలో కొత్త కోణం

హత్యను ఆత్మహత్యగా  చిత్రీకరించే ప్రయత్నం

పోలీసుల విచారణతో వాస్తవం వెలుగులోకి

హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు

విజయవాడ / ఉయ్యూరు : వివాహిత అనుమానాస్పద మృతిలో కొత్తకోణం వెలుగు చూసింది. అనుమానం పెనుభూతంగా మారి తాళి కట్టిన భర్తే ఉరి తాడు బిగించి కాలయముడయ్యాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పుకునేందుకు చూడగా చివరకు పోలీసులు జరిపిన విచారణలో వాస్తవాలు వెలుగు చూడటంతో కటకటాలపాలయ్యాడు. ఉయ్యూరు సీఐ కాశీవిశ్వనాథం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏజీకే నగర్‌లో ఆరేపల్లి రామలక్ష్మి (35) ఈ నెల 11న మృతి చెందింది. రేకుల షెడ్డులో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త శివనాగమల్లేశ్వరరావు తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. లోపల గడియపెట్టి ఉండటంతో తొలుత అందరూ ఆత్మహత్యగానే భావించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాదు హత్యే అంటూ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయి.

పెళ్లయిన ఏడాది నుంచే.. 
రామలక్ష్మితో 11 ఏళ్ల క్రితం శివనాగమల్లేశ్వరరావుకు వివాహమైంది. ఇరువురూ ఉయ్యూరుకు చెందిన వారే. పెళ్లి అయిన ఏడాది దాటినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలు పెడుతున్నాడు. భర్త వేధింపులు తాళలేక 2013లో పోలీస్‌ స్టేషన్‌లో రామలక్ష్మి కేసు పెట్టడం, పెద్దలు నచ్చచెప్పి లోక్‌ అదాలత్‌లో రాజీ చేయడం జరిగాయి. తన ఇద్దరు పిల్లల కోసం రామలక్ష్మి బాధలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భార్య ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ రామలక్ష్మిని వేధించేవాడు. ఈ క్రమంలోనే తరచూ భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తుతోంది. 

15 రోజుల క్రితం అఘాయిత్యం..
కాగా, భర్త వేధింపులు తాళలేక 15 రోజుల క్రితం రామలక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాపాయం నుంచి బయటపడేసి నచ్చజెప్పి కాపురానికి పంపారు. ఈ నెల 11వ తేదీన ఇంటికి వచ్చిన రామలక్ష్మితో మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను మంచంపై నుంచి పడేసి చేతులు రెండూ కరెంటు వైర్లతో కట్టేసి దిండుతో మొహంపై నొక్కి ఊపిరాడకుండా చేసి ఆపై మెడను వైరుతో బిగించి చంపేశాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మెడకు చీరను కట్టి రేకుల షెడ్డుకు వేలాడతీసి లోపలి పక్కన గడియపెట్టి తలుపు గుమ్మానికి, తడికకు మధ్య ఉన్న ఖాళీని ఆసరాగా చేసుకుని బయటకు వచ్చి సైకిల్‌పై ఏమీ తెలియనట్లు ఉడాయించాడు. 

పాఠశాల నుంచి ఇంటికి మధ్యాహ్న సమయంలో భోజనానికి వచ్చిన కుమార్తె తడికలో ఉన్న రంధ్రంలో నుంచి చూసి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా వేలాడుతూ కనిపించింది. పోలీసుల కేసు విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. అనుమానాస్పద మృతిని హత్య కేసుగా మార్పు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్‌ఐ సత్యశ్రీనివాస్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top