ఖాకీసారూ.. ఇదేమి తీరు! | husband cheating by wife | Sakshi
Sakshi News home page

ఖాకీసారూ.. ఇదేమి తీరు!

Nov 12 2017 10:17 AM | Updated on Jun 4 2019 6:31 PM

husband cheating by wife - Sakshi

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని పాతూరు రాజాజీవీధిలో నివాసముంటున్న గవిసిద్దన్న గౌడ్‌ కుమారుడు చంద్రమోహన్‌గౌడ్‌కు నగరానికే చెందిన రామకృష్ణ కుమార్తె అనితతో గతేడాది మార్చిలో వివాహమైంది. 30తులాల బంగారు, రూ. 5లక్షల నగదు కట్నకానుకల కింద ఇచ్చుకున్నారు. తొలినాళ్లలో సంతోషంగా సాగిన వీరి సంసారంలో చిన్నచిన్న మనస్పర్థలు వచ్చాయి. భర్త నుంచి అనితకు వేధింపులు మొదలయ్యాయి. అయినా ఆమె అలాగే భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చంద్రమోహన్‌ తన తండ్రిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆస్తిపాస్తుల పత్రాలన్నీ వెంట తీసుకెళ్లాడు. ఐదారు నెలలవుతున్నా తిరిగి చూడలేదు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆశ్రయించింది. 

కౌంటర్‌ కేసులు :
గతంలో వన్‌టౌన్‌ సీఐగా పనిచేసిన రాఘవన్‌ ఈ విషయంలో ఇరువర్గాల వారికీ కౌన్సెలింగ్‌ చేశారు. సమస్య కొలిక్కి వచ్చేవరకు జీవనానికి ప్రస్తుతం ఉన్న ఇంటితో పాటు వెనుక ఉన్న మరోపోర్షన్‌ ఇంటిని అద్దెకు ఇచ్చుకొని జీవించాలని అమ్మాయికి సూచించారు. వన్‌టౌన్‌ సీఐగా సాయిప్రసాద్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. భర్త, ఆడపడుచు కలిసి అనితపై ఫిర్యాదు చేయడంతో ఆమెపై కౌంటర్‌ కేసులు నమోదు చేశారు. పైగా ప్రస్తుతమున్న ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. రైటర్‌ ఆనంద్‌ ప్రతి రోజూ వచ్చి ఖాళీ చేయకపోతే మేమే బలవంతంగా సామాన్లు బయటకు పడేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. జీవనం కోసం ఉంచుకున్న మరో ఇంటిని బలవంతంగా పోలీసులే దగ్గరుండి పగలగొట్టించారని ఆరోపించింది.

సీఐపై కేసు వేయడంతోనేనా?
సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని బాధితురాలు కోర్టులో పిటిషన్‌ వేసింది. దీన్ని జీర్ణించుకోలేకపోవడంతో కేసును ప్రిస్టేజస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోబాధితులపై కౌంటర్‌ కేసులు పెట్టించినట్లు సమాచారం.  పోలీసులే బెదిరిస్తే తమకు ఇక న్యాయం ఎవరు చేస్తారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నఫలంగా గెంటేస్తే  తాను ఎలా బతకాలని, ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సివిల్‌ పంచాయితీలు చేయకూడదని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటిని బేఖాతరు చేస్తున్నారని దీంతో నిరూపితమవుతోంది. భార్యాభర్తల విషయం, ఆస్తి తగదాల విషయం కోర్టులో పరిష్కరించుకోవాల్సిన అంశాలు. అయినప్పటికీ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తుండడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆ ఇంటితో ఆమెకు సంబంధం లేదు
ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లుతో అనితకు సంబంధం లేదు. యూఎస్‌ఏలో ఉంటున్న చంద్రమోహన్‌ అక్కకు ఆ ఇంటిని వాళ్లనాన్న రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆమె పిటిషన్‌ పెట్టుకుంది. ఈ విషయాన్ని అనితకు చెప్పాం. అలాగే ఆమె ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశామని, కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని తెలియజేశాం.
–  సాయిప్రసాద్, సీఐ, వన్‌టౌన్‌

పోలీసులకేం తెలుసు మా బాధ!
తమ బిడ్డకు పోలీసులే న్యాయం చేయడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. పెళ్లి జరిగి ఏడాదైంది. ఇలాంటి  సమయంలో బాధితురాలికి అండగా ఉండాల్సింది పోయి మగ పిల్లాని పక్షాన నిలబడుతున్నారు. పెళ్లి చేసుకొని అమ్మాయిని వదిలిపెట్టిపోతే తల్లిదండ్రులకు ఉండే బాధ వారు గుర్తించడం లేదు. ప్రతి రోజూ పోలీసులు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు.                 
  – యల్లమ్మ, అనిత తల్లి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement