ధనత్రయోదశి ధగధగలు

Huge Gold Jewelleries Sales In Gold Shops On Dhanteras Day - Sakshi

ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే శుభదినం ధనత్రయోదశి. వెలుగు దివ్వెల పండుగ దీపావళికి రెండు రోజుల ముందు జరుపుకునేదీ ఈ ఉత్సవం. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకలశుభాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ ధనత్రయోదశి నాడు శక్తికొలది బంగారం కొని లక్ష్మీదేవిని సేవిస్తారు. ఈ నేపథ్యంలో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి.

సాక్షి, విజయవాడ: భారతీయ సమాజంలో ధనత్రయోదశికి విశేషమైన ప్రత్యేకత ఉంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, యమత్రయోదశిగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ధనత్రయోదశిని ధనతేరస్‌గా జరుపుకుంటారు. ఈ రోజును ఐశ్వర్య ప్రదాయక రోజుగా వారు భావిస్తారు. ధన త్రయోదశి రోజున ఉత్తర భారతీయులు పలు ప్రత్యేక పూజల ద్వారా లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని పొందేందుకు ప్రత్యేకమైన రోజుగా భావించి పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశి సూచికగా భావిస్తారు. ఆ రోజున వెండి, బంగారాన్ని కొని ధనలక్ష్మిని అర్చిస్తారు.
 

ధన్వంతరి అవతరణ దినోత్సవం కూడా..
ఆయుర్వేద వైద్యానికి ఆది పురుషుడైన ధన్వంతరి అవతరించినది కూడా ధనత్రయోదశి రోజునే. క్షీరసాగర మధనంలో మహాలక్ష్మీతో పాటుగా ధన్వంతరి కూడా ఆవిర్భవించినట్లు పౌరాణికగాథ. ప్రతి ధనత్రయోదశి రోజున జ్యూయలరీ దుకాణాల్లో విస్తృతమైన అమ్మకాలు జరుగుతాయి. ధనత్రయోదశి రోజు కోసం నెల రోజుల ముందు నుంచే వినియోగదారులను ఆకర్షించే విధంగా ప్రకటనలు ఇస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారతదేశంలో జరిగే మొత్తం బంగారు ఆభరణాల అమ్మకాల్లో ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా జరిగే అమ్మకాలు 15 నుంచి 20 శాతం ఉంటాయంటే దీని ప్రభావం ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

జ్యూయలరీ దుకాణాల్లో ప్రారంభమైన సందడి
నగరంలో ధనత్రయోదశికి సంబంధించి నాలుగు రోజుల క్రితం నుంచే జ్యూయలరీ దుకాణాల్లో సందడి ప్రారంభమైంది. పలు దుకాణాలు ఇప్పటికే ధనత్రయోదశికి ఆఫర్లు ప్రకటించాయి. మేకింగ్‌ చార్జీలు, తరుగులో ప్రత్యేకంగా రాయితీని ప్రకటించాయి. ఎంత బంగారం కొనుగోలు చేస్తే అంత వెండి ఉచితమని ప్రకటించాయి. వాటితో పాటుగా పలు ప్రత్యేక రాయితీలంటూ నాలుగు రోజులుగా విస్తృతంగా ప్రకటనలు చేస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది కూడా ధనత్రయోదశిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వ్యాపారాన్ని పెంచుకునేందుకు జ్యూయలరీ దుకాణాలు పోటీ పడుతున్నాయి. 

నేటి మధ్యాహ్నం నుంచి త్రయోదశి తిథి
ఈ ఏడాది ధనత్రయోదశి ఘడియలు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమై శనివారం మధ్యాహ్నం వరకూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది శుక్రవారం మరికొంతమంది శనివారం ఈ పర్వదినాన్ని జరుపుకుంటారని పండితులువ వివరిస్తున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top