ఎట్టకేలకు పీఆర్సీ జీవోలు | However, PRC GO released | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు పీఆర్సీ జీవోలు

May 2 2015 1:07 AM | Updated on Sep 3 2017 1:14 AM

ఎట్టకేలకు పీఆర్సీ జీవోలు

ఎట్టకేలకు పీఆర్సీ జీవోలు

ఎట్టకేలకు ఉద్యోగుల పీఆర్సీ జీవోలు శుక్రవారం దర్శనమిచ్చాయి. గురువారం కేవలం జీవో నంబర్లు ఇవ్వడానికే పరిమితమైన ప్రభుత్వం.

 నాలుగు జీవోల నంబర్లు గురువారమే ఇచ్చిన ప్రభుత్వం
 తాజాగా 43 శాతం ఫిట్‌మెంట్, డీఏ, సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ జీవోల విడుదల
 గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వరంగ సంస్థల ప్రస్తావన లేనే లేదు
 జేఏసీకి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీకి భిన్నంగా జీవో

 
హైదరాబాద్: ఎట్టకేలకు ఉద్యోగుల పీఆర్సీ జీవోలు శుక్రవారం దర్శనమిచ్చాయి. గురువారం కేవలం జీవో నంబర్లు ఇవ్వడానికే పరిమితమైన ప్రభుత్వం.. శుక్రవారం 43 శాతం ఫిట్‌మెంట్, 8.908 శాతం కరువు భత్యం(డీఏ), ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) జీవోలను తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని జీవోలో పేర్కొంది.


అయితే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వరంగ సంస్థల సిబ్బందికి కూడా వేతనాల సవరణకు ఒకే జీవో జారీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల జేఏసీకిచ్చిన హామీకి భిన్నంగా జీవో రావడం గమనార్హం. సీఎం స్థాయిలో హామీ వచ్చాక కూడా అమలు దగ్గర మెలిక పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


43 శాతం ఫిట్‌మెంట్..
పీఆర్సీ కొత్త వేతనాల నిర్ధారణకు అనుసరించిన సూత్రం ప్రకారం.. 2013 జూలై 1 నాటి మూల వేతనం+అప్పటి డీఏ 63.344 శాతం+43 శాతం ఫిట్‌మెంట్.. గణించి కొత్త మూలవేతనాన్ని నిర్ధారించాలని జీవోలో పేర్కొన్నారు. ఈ గణింపు ప్రకారం వచ్చిన మొత్తం.. పీఆర్సీ సిఫారసు చేసిన మాస్టర్ స్కేళ్లలో లేకుంటే, దానికి ఇంక్రిమెంట్లు కలిపి తదుపరి ‘స్టేజ్’ మూల వేతనాన్ని ఫిక్స్ చేయాలని సూచించారు. నిజానికి కొత్త వేతనాలు 2013 జూలై 1 నుంచి అమలవుతాయి. అయితే 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1 వరకు పెంపు కాగితాలకే పరిమితం(నోషనల్ బెనిఫిట్) అవుతుంది.


వాస్తవంగా ఆర్థిక లబ్ధి 2014 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటినుంచి 2015 మార్చి వరకు.. అంటే 10 నెలల బకాయిలను ఎలా చెల్లించాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2015 ఏప్రిల్ నుంచి నగదు రూపంలో పెంపును ఉద్యోగులకు చెల్లించనున్నారు. మే నెల జీతంతోపాటే ఏప్రిల్ నెల పెంపును కలిపి జూన్ 1న చెల్లించనున్నారు. ఆర్థికశాఖ అమలు చేస్తున్న సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం-సీఎఫ్‌ఎంఎస్) ద్వారా డేటా, బకాయిల ఫారాలు సమర్పించిన ఉద్యోగులకే కొత్త జీతాలు అందుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2013 ఆఖరు వరకు ఉన్న కరువు భత్యం(డీఏ) సవరించిన వేతనాల్లో కలిసింది. 2014లో రెండు దఫాలు కలసి కేంద్రం పెంచిన 17 శాతం డీఏ పదో పీఆర్సీ సూత్రీకరణ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.908 శాతం వస్తుంది. దీన్ని కొత్త మూల వేతనం మీద చెల్లించనున్నారు.


గ్రేటర్ లో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ
ఇంటి అద్దెభత్యం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో 30 శాతం, 2 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రేటర్ విశాఖ, అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరంలో 20 శాతం, 5 వేలు- 2 లక్షల మధ్య జనాభా ఉన్న 57 పట్టణాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం చొప్పున చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ఏ గరిష్ట పరిమితిని రూ. 20,000గా నిర్ణయించారు.


సీసీఏ గరిష్టంగా రూ.1,000
సీసీఏ(సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్) హైదరాబాద్‌లో గరిష్టంగా రూ.1,000, విశాఖ, విజయవాడలో రూ.700, మిగతా కార్పొరేషన్లలో రూ. 500 చొప్పున ఇవ్వనున్నారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి.. మొత్తం 11 పట్టణాల్లోనూ సీసీఏ చెల్లించనున్నారు.
 

ఏమిటీ డ్రామా?
మొదట జీవోల నంబర్లు ఇవ్వడం, తర్వాత జీవోలు ఇవ్వడం.. ఏమిటి ఈ డ్రామా? ఎందుకు ఇంత డ్రామా జరుగుతోంది? చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఉద్యోగ సంఘాల జేఏసీకిచ్చిన హామీ మేరకు పీఆర్సీని అమలు చేయాలి. అందుకు అనుగుణంగా అన్ని జీవోలను వెంటనే ఇవ్వాలి.  - ఐ.వెంకటేశ్వరరావు,  జేఏసీ సెక్రటరీ జనరల్
 

స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లేవీ
పదో పీఆర్సీ సిఫారసు చేసిన 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల గురించి జీవో-46లో ప్రస్తావించలేదు. గత పీఆర్సీలో ఇచ్చిన ఇంక్రిమెంట్ ఆప్షన్, స్టెప్‌అప్ సౌకర్యాలను కొనసాగించాలి. పీఆర్సీ అమలుకు సంబంధించిన అన్ని జీవోలను వెంటనే ఇవ్వాలి.
 - కత్తి నరసింహారెడ్డి,  ఎస్టీయూ అధ్యక్షుడు
 

సీఎఫ్‌ఎంఎస్ పేరిట సర్కారు దగా!
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్) పేరిట కొత్త వేతనాల చెల్లింపును మరికొంత కాలం వాయిదా వేయడానికి, తద్వారా ఉద్యోగులను మోసం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందనే అనుమానాల్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 21న ఆర్థికశాఖ జారీ చేసిన జీవో-45 ప్రకారం.. జూలై 1 నుంచి సీఎఫ్‌ఎంఎస్ అమలవుతుంది. ఏప్రిల్ 10న జరిగిన అన్ని శాఖల కార్యదర్శుల సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ జీవోలో ఉంది.


అయితే.. శుక్రవారం జారీ చేసిన పీఆర్సీ జీవో 46 ప్రకారం.. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా డేటా సమర్పించిన ఉద్యోగులకే కొత్త వేతనాలు అందుతాయనే నిబంధన ఉంది. సీఎఫ్‌ఎంఎస్ అమల్లోకి వచ్చేదే జూలై 1 నుంచి అయితే జూన్ 1న అందాల్సిన కొత్త జీతాలకు దానితో ముడిపెట్టడం అంటే.. పీఆర్సీ అమలును సాంకేతిక కారణాలు చూపించి వాయిదా వేయడమేనని ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
 
సీసీఏ చెల్లింపులు మూల వేతనాల వారీగా..  (రూపాయల్లో)
 మూలవేతనం               జీహెచ్‌ఎంసీలో,    గ్రేటర్ విశాఖ ,విజయవాడలో       మిగతా   మున్సిపాలిటీల్లో
 16,400 వరకు             400                  250                                          200
 16,400-28,940         600                  350                                          300
 28,940-37,100         700                  450                                          350
 37,100 పైన                1000                700                                          500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement