
పీఆర్సీ లేదు, ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు
సాక్షి అమరావతి/అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక అంశాలు అటుంచితే ఆర్థికేతర అంశమైన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని నియమించలేదని, మూడు పెండింగ్ డీఏల్లో ఒక్కటీ ఇవ్వలేదని, ఉద్యోగులకు నాయకులుగా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం పీఆర్సీని నియమించకపోవడం, డీఏలు ప్రకటించకపోవడంతో ఉద్యోగులు అభద్రతాభావంలో ఉన్నారన్నారు. పీఆర్సీ ప్రక్రియ ఎంత ఆలస్యం అయితే ఉద్యోగులకు అంత నష్టమన్నారు. ఇక 2024 జనవరి, జూన్, 2025 జనవరికి సంబంధించి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల దాటితే మరో డీఏ కలుస్తుందన్నారు. ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల నిర్వహణ భారాన్ని తహసీల్దార్లు భరించాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రొటోకాల్‌కు రూ.లక్షలు ఖర్చు అవుతున్నాయని, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వం లీగల్ చార్జీలూ ఇవ్వకపోవడంతో కోర్టు కేసులకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.
ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదు?
ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో గుంటూరులో ఆక్రమణల తొలగింపు అంశంలో అప్పటి తహసీల్దారు తాతా మోహన్‌రావుపై కోర్టు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన పనిచేశారన్నారు. అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు.
పైవారు చెప్పిన పని చేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిర్ణయాన్ని ఉన్నతాధికారులు నోటితో చెబితే కాకుండా లిఖితపూర్వంగా ఆదేశాలిస్తేనే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోనూ విలేకరులతో మాట్లాడిన బొప్పరాజు ఇంతకాలమైనా సర్కారు పీఆర్సీని ఎందుకు నియమించలేకపోయిందని, ఒక్క డీఏ కూడా ఇవ్వలేదేమని ప్రశ్నించారు.