కానూరులోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.
=ఉరివేసుకొని మృతి
=కానూరులో ఘటన
కానూరు(పెనమలూరు), న్యూస్‌లైన్ : కానూరులోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోని కేఎస్సార్ నగర్‌కు చెందిన గుత్తికొండ విద్య (16) కానూరు శ్రీ చైతన్య నియోన్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు చెందిన అపరాజిత హాస్టల్ క్యాంపస్‌లో ఉంటోంది. ఈమె రెండు రోజుల క్రితం సిక్ అయ్యానంటూ ఇంటికి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వచ్చింది.
ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు తన ఐదుగురు రూమ్‌మెట్స్‌తో సరదాగా గడిపి నిద్ర పోయింది. కాగా తెల్లవారుజామున 4.45 గంటలకు విద్యార్థులను నిద్ర లేపడానికి వచ్చిన వార్డెన్‌కు విద్య చున్నీతో మెడకు ఉరి బిగించుకొని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో వార్డెన్‌తో పాటు రూమ్‌లో ఉన్న మిగతా విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కళాశాల యాజమాన్యం నుంచి సమాచారం అందడంతో సీఐ ధర్మేంద్ర ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. మృతురాలి తండ్రి పూర్ణచంద్రరావు, తల్లి కల్పన, ఇతర బంధువులు వచ్చిన తరువాత మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రభుత్వాస్పత్రి వద్ద శవపంచనామా చేసే సమయంలో మృతురాలి బంధువులు కళాశాల యాజమాన్యం స్పందించిన తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చివరకు శవపంచనామా అనంతరం మృతదేహాన్ని తీసుకు వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. సీఐ ధర్మేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.