శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాను మరిపించే సీన్‌!!

Hospital Management Without Permits In Rajamahendravaram - Sakshi

అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహణ

మెడికల్‌ షాపు అనుభవంతో వైద్యం

ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్‌ చేసిన వైద్యాధికారుల

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో సీన్‌లా ఆ మెడికల్‌ షాపునకు ‘ఏసీఈ( ఏస్‌) ఆసుపత్రి అని బోర్డు తగిలించేశారు. ఏడు పడకల ఆసుపత్రిగా బిల్డప్‌ చేశారు. ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్ల సహాయంతో రోగులను ఆసుపత్రికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. జూనియర్‌ డాక్టర్లను ఆసుపత్రికి తీసుకొచ్చి.. అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నామని హడావుడి చేశారు. ‘మా ఆసుపత్రికి నెలకు ఐదుగురు రోగులను పంపిస్తే రూ.వెయ్యి గిఫ్ట్‌ కార్డు, పది మందికి రూ.2 వేలు, 15 మందికి రూ.3 వేలు, 25 మందికి రూ.6 వేలు గిఫ్ట్‌ కార్డు ఇస్తాం’ అంటూ  ఆసుపత్రి యాజమాన్యం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటనలు వాట్సాప్‌లలో షేర్‌ చేశారు. ఇది గమనించిన జనం జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు తనిఖీ చేశారు. ఆసుపత్రి పేరుతో వారు చేస్తున్న కార్యకలాపాలను చూసి కంగుతిన్నారు.

సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం ): డిగ్రీ చదివి, మెడికల్‌ షాపు నిర్వహించుకునే రామచంద్రన్, రాజేష్‌లు రాజమహేంద్రవరం సీతం పేటలోని ఏసీఈ(ఏస్‌)ఆసుపత్రిని ప్రారంభించారు. వీరు జూనియర్‌ డాక్టర్లు పి.నిఖిల్, ఎం.రాజేంద్రలతో కలసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఏడు పడకల ఆసుపత్రి అంటూ ఒక షాపులో ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే నిర్వహణకు సిద్ధమయ్యారు. మెడికల్‌ షాపు నిర్వహించే వారు ఏకంగా డాక్టర్ల అవతారం ఎత్తడంతో స్థానికులు ఈ ఆసుపత్రి వ్యవహారాన్ని వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు రంగంలోకి దిగి ఆసుపత్రిని తనిఖీ చేశారు. డాక్టర్‌కు చెల్లించే నెల జీతం రూ.1.50 లక్షలు ఏ విధంగా చెల్లిస్తున్నారో కూడా సరైన రికార్డులు వారు నిర్వహించడం లేదు. 

అనుమతి లేకుండా ఆసుపత్రి ఏర్పాటు
జిల్లాలో ఏవిధమైన క్లినిక్‌లు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్నా జిల్లా వైద్యాధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ) అనుమతి తప్పనిసరి. ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు, రోగులకు అందించే వైద్య సేవలు, వైద్య పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. వైద్య అధికారుల నుంచి ఏవిధమైన అనుమతులు లేకుండానే ఏసీఈ(ఏస్‌) ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటనలు ఇచ్చిన ఆసుపత్రి యాజమాన్యం రోగుల చికిత్సకు ఉపయోగించే పరికరాలేవీ లేకుండానే ఆసుపత్రిని నిర్వహించడంపై వైద్యాధికారులే అవాకయ్యారు. అనుభవం లేకుండానే ఆసుపత్రి నిర్వహించి కోట్లకు పడగలెత్తాలనే లక్ష్యంతో సేవా రంగాన్ని వ్యాపారరంగంగా మార్చారంటూ వైద్య మండలి చైర్మన్‌ సాంబశివారెడ్డి వెల్లడించారు.

ఆసుపత్రిని సీజ్‌ చేశాం
ఈ ఆసుపత్రి నిర్వహణకు అనుమతి లేదు. రికార్డులూ సక్రమంగా లేవు. ఆసుపత్రి నిర్వహణ వ్యాపార దృక్పథంతో జరుగుతోంది. సరైన మౌలిక సదుపాయాలు, రోగులకు వైద్యం అందించే పరికరాలు లేకుండానే ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర వైద్యాధికారులకు నివేదిక అందిస్తున్నాం. 
– డాక్టర్‌ టి. రమేష్‌ కిషోర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top