
కలవరపరుస్తున్న ఖాకీల ఆత్మహత్యలు
జిల్లాలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. రెండేళ్ల కాలంలో ఐదుగురు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
=రెండేళ్లలో ఐదుగురి బలవన్మరణం
=కాజీపేటలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
=కుటుంబ కలహాలే కారణమా ?
=ఉద్యోగపరమైన ఒత్తిళ్లా ?
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. రెండేళ్ల కాలంలో ఐదుగురు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ సందీప్ మృతిని మరవకముందే కాజీపేట ఠాణాలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ వరుస సంఘటనలు పోలీసు శాఖను కలవరపెడుతున్నాయి. ధైర్యానికి, సాహాసానికి మారుపేరైన పోలీసు శాఖలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కానిస్టేబుళ్ల ఆత్మహత్యకు కారణం కుటుంబ తగాదాలా..? అధికారుల ఒత్తిడా..? అని బహిరంగంగానే చర్చ జరుగుతోంది.
రెండేళ్లలో ఐదుగురు..
తొర్రూరుకు చెందిన ఆర్‌మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా, నర్సంపేటకు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ దుగ్గొండి పీఎస్‌లో పనిచే స్తుండగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే తాడ్వాయి పీఎస్‌లో పనిచేస్తూ శ్రీనివాస్ అనే కానిస్టేబుల్, డిస్ట్రిక్ గార్డ్స్‌లో పని చేస్తూ మల్లంపల్లికి చెందిన కానిస్టేబుల్ కర్ణాకర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ సందీప్ ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సందీప్ ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే కాజీపేట పీఎస్ కానిస్టేబుల్ బాదావత్ హరిలాల్ ఆత్మహత్యకు యత్నించడం సంచలనం సృష్టించింది.
కుటుంబ కలహాలా..? అధికారుల ఒత్తిడులా..?
కానిస్టేబుళ్ల ఆత్మహత్యలకు కుటుంబ కలహాలు కారణమా...? అధికారుల ఒత్తిడి కారణమా...అనే దానిపై బహిరంగ చర్చ కొనసాగుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన అన్ని సందర్భాల్లోనూ అధికారుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్టేషన్లలో సిబ్బంది కొరత వల్ల సెలవుల మంజూరు విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అత్యవసరమైనప్పుడు కూడా అధికారులు సెలవు ఇవ్వకపోవడం కానిస్టేబుళ్లను మరింత మనోవేదనకు గురిచేస్తోంది. ఈ అంశం కూడా వారి ఆత్మహత్యకు కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా సదరు సిబ్బందికి ఉన్న వ్యక్తిగత అలవాట్లు, కుటుంబ తగాదాలు, విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయని పోలీసు శాఖలో మరో చర్చ జరుగుతోంది.
కౌన్సెలింగ్ అవసరం..
ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు పరిశీలిస్తే పోలీసుశాఖలో ఉన్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగులకు తరచూ కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులు ఒక అడుగు ముందుకు వేస్తే ఆత్మహత్యలకు ముగింపు పలకవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడులు, కుటుంబ తగాదాలతో ఉన్న కానిస్టేబుళ్లను గుర్తించి వారికి కుటుంబాలతోసహా కౌన్సెలింగ్ చేస్తే ఆత్మహత్యలను నివారించవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.