
వానొస్తే వరదొచ్చినట్టే...!
ఒంగోలు నగరంలోని రహదారులపై పొంగిపొర్లుతున్న నీళ్లు చూస్తే భారీ వర్షం పడిందనుకుంటే పొరపాటే.
- అధికారులు, నేతల నిర్లక్ష్య ఫలితం
- చిన్నపాటి వర్షానికే ఒంగోలు జలమయం
- నగరం నడిబొడ్డునా అదే పరిస్థితి
- శివారు ప్రాంతాల్లో నరకమే
ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలోని రహదారులపై పొంగిపొర్లుతున్న నీళ్లు చూస్తే భారీ వర్షం పడిందనుకుంటే పొరపాటే. బుధవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే నగరం నరకంగా మారింది. నగరపాలక పాలనా తీరును, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల నిర్లక్ష్యాన్ని మరోసారి ఎండగట్టింది. ఎప్పటికప్పుడు ఇలా ఇబ్బందులు తలెత్తుతున్నా సమస్య తీవ్రతను గుర్తించకపోవడంతో నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడుతోందని నగరవాసుల విమర్శిస్తునానరు. స్థానిక పి.వి.ఆర్. బాలుర పాఠశాల వద్ద మురుగు కాలువల్లోకి వర్షపు నీరు వచ్చి చేరటంతో ఆ నీరంతా రోడ్లపైకి పరుగులు తీసింది. దాని పక్కనే ఉన్న కేంద్రీయ విద్యాలయం రోడ్డు, భాగ్యనగర్ రోడ్లపై వర్షపునీటితోపాటు మురుగు కాలువలు పొంగి ఇళ్లల్లోకి వెళ్లాయి.
పాత మార్కెట్ సెంటర్‌లోని సెయింట్ థెరిస్సా పాఠశాల, నెల్లూరు బస్టాండ్ ప్రాంతంలోని బధిరుల పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇక్కట్టకు గురయ్యారు. శివారు కాలనీలైన ఏకలవ్యనగర్, కేశవరాజు కుంట, మిలటరీ కాలనీ, ఇందిరా నగర్‌లలోని లోతట్టు ప్రాంత ఇళ్ళల్లో మురుగు నీరే పారింది. కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్న ఫ్లై ఓవర్ వర్షపు తాకిడికి దెబ్బతిని వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పోతురాజు కాలువపై ఉన్న చప్టాలకు పలుచోట్ల సరైన రెయిలింగ్ లేకపోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయోందోళనకు గురవుతున్నారు. వర్షానికి ఇబ్బందులున్న ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నాం...
- సిహెచ్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్
జలమయమైన కాలువలు, రోడ్లను గుర్తించాం. ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించాం.