ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి

Heavy Inflow To Prakasam Barrage - Sakshi

సాక్షి, విజయవాడ/ గుంటూరు : ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వదర నీరు చేరుతోంది. దీంతో పదేళ్ల తర్వాత బ్యారేజ్‌ పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది.  పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్న సంగతి తెలిసిందే. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బ్యారేజ్‌ 70 గేట్లను కొంత ఎత్తు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలో ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. మరికాసేపట్లో  ప్రాజెక్టు గేట్లను మరికొంత ఎత్తుకి లేపి.. నీటి విడుదలను పెంచనున్నారు. 

గేట్ల ఎత్తు పెరిగితే.. దిగువకు నీటి ప్రవాహం పెరిగనుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌ నుంచి అవుట్‌ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు. వరత ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కూడా ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన ఆదేశించారు. రెస్క్యూ టీమ్‌లను కూడా సిద్దం చేశామని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని వెల్లడించారు. మరోవైపు జలకళ సంతరించుకున్న ప్రకాశం బ్యారేజీను చూసేందుకు భారీగా సందర్శకులు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : గుంటూరు కలెక్టర్‌
కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జున సాగర్‌ నుంచి దిగువకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో.. ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు. ఇప్పటికే పులిచింతల ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. అదే విధంగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కరకట్టలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని.. బలహీనంగా ఉన్న కరకట్టల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు

వరదల్లో చిక్కుకున్న 17 మంది గొర్రెల కాపరులు..
చందర్లపాడు మండలం కృష్ణా పరివాహక ప్రాంతంలో 17 మంది గొర్రెల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సుమారు 400 గొర్రెలు కూడా అక్కడే నిలిచిపోయాయి. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో వారు అక్కడే నిలిచిపోయారు. దీంతో వారిని బయటకు తీసుకురావడానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top