తేల్చి.. ముంచారు | Heavy difference between first and last survey | Sakshi
Sakshi News home page

తేల్చి.. ముంచారు

Nov 13 2013 11:44 PM | Updated on Sep 2 2017 12:34 AM

తుపాన్ వల్ల దెబ్బతిన్నపంట నష్టంపై అధికారులు లెక్క తేల్చారు. అయితే ప్రాథమిక అంచనాలతో పోల్చితే తుది నివేదికలో మూడో వంతు నష్టం తరిగిపోయింది.

సాక్షి, సంగారెడ్డి:  తుపాన్ వల్ల దెబ్బతిన్నపంట నష్టంపై అధికారులు లెక్క తేల్చారు. అయితే ప్రాథమిక అంచనాలతో పోల్చితే తుది నివేదికలో మూడో వంతు నష్టం తరిగిపోయింది.  గత నెల 23- 26 తేదీల మధ్య కురిసిన జడివానకు  జిల్లాలో 34,693 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేల్చి న అధికారులు.. సమగ్ర సర్వే తర్వాత ఈ నష్టాన్ని 26,839 హెక్టార్లుగా ఖరారు చేశారు. ఎప్పుడు లేని విధంగా ఈ సారి కఠిన నిబంధనలు అమలు చేశారు. పొలంలో ఉన్న పంట(స్టాండింగ్ క్రాప్)ల సర్వేకు మాత్రమే ఆదేశించడం, వీడియో చిత్రీకరణ జరపాలనే విచిత్ర మెలిక పెట్టడంతో తుది జాబితాల తయారీపై ప్రభావం చూపింది. వర్షాల తర్వాత మళ్లీ కోలుకున్న పంటలను మినహాయిం చినట్లు అధికారులు పేర్కొంటున్నా.. ప్రాథమిక, తుది సర్వేల మధ్య భారీ వ్యత్యాసం సందేహాలను రేకెత్తిస్తోంది.
 సర్వే ముగిసింది
 జిల్లాలోని 33 మండలాల పరిధిలోని 768 గ్రామాల్లో 11,343 హెక్టార్ల వరి, 991.7 హెక్టార్ల మొక్కజొన్న, 14,487 హెక్టార్ల పత్తి, 4.8 హెక్టార్లలో చెరకు, 3.2 హెక్టార్లలో కంది, 9 హెక్టార్లలో సోయా పంటలు దెబ్బతినడంతో 76,775 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు తేల్చారు. అత్యధికంగా జగదేవ్‌పూర్ మండలంలో 3,644 హెక్టార్లు, చిన్నకోడూరు మండలంలో 3,304 హెక్టార్లు, నంగనూరు మండలంలో 3,244 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు మండల స్థాయి నుంచి వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయానికి నివేదికలు అందాయి. తుది జాబితా తయారీకి జిల్లా కలెక్టర్ విధించిన గడువు బుధవారంతో ముగిసింది.

ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిర్వహించిన ఉమ్మడి సర్వే సైతం ఇప్పటికే ముగిసిపోవడంతో, జిల్లా వ్యవసాయ శాఖ తుది నివేదిక తయారీపై దృష్టిపెట్టింది. మండలాల నుంచి వచ్చిన నివేదికల్లో రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతా నంబర్లతో తుది జాబితాను రూపొందించి సమర్పిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
 ఇన్‌పుట్ సబ్సిడీ రూ.26.64 కోట్లే
 ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం  ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తోంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం వరి, పత్తి పంటలు దెబ్బతింటే హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్న హెక్టారుకు రూ.8,333 చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ వర్తించనుంది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం.. వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు పరిహారం ఇలా రానుంది.
 11,343 హెక్టార్లలో వరి వరి పంట దెబ్బతినడంతో రూ.11.34 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ వర్తించనుంది.
 991.7 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో రూ.82.63 లక్షల పరిహారం వర్తించనుంది.
 14,487 హెక్టార్లలో పత్తి పంట దెబ్బతినడంతో రూ.14.48 కోట్ల పరిహారం రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement