నవ్వుతూ వెళ్లి.. జీవచ్ఛవమై తిరిగొచ్చింది

Harassment on Women in Saudi And Leave Bangalore Airport - Sakshi

బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన మహిళకు చిత్రహింసలు

విమానం ఎక్కించి బెంగళూరు ఎయిర్‌ పోర్టులో వదిలేసిన వైనం

కురబలకోట/మదనపల్లె టౌన్‌ (చిత్తూరు జిల్లా): ఐదేళ్ల క్రితం ఆమె నవ్వుతూ సౌదీ విమానం ఎక్కింది. ఇప్పుడు సోదరులు సైతం గుర్తు పట్టలేనంతగా జీవచ్ఛవంలా మారి విమానంలోంచి వీల్‌ చైర్‌లో తిరిగొచ్చింది. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన ఆ మహిళను అక్కడ చిత్రహింసలకు గురి చేసి.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను విమానంలో ఎక్కించి బుధవారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్‌ పోర్టుకు పంపారు. అక్కడ ఆమెను వదిలేసి వెళ్లినట్లు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కురబలకోట రైల్వేస్టేషన్‌ పక్కనున్న అరవిందపురానికి చెందిన కె.మల్లిక (42) నిరుపేద. భర్త పట్టించుకోకపోవడంతో తల్లితోనే ఉండేది. ఐదేళ్ల క్రితం కురబలకోటకు చెందిన ముగ్గురు ఏజెంట్లు ఆమెకు సౌదీ ఆశలు కల్పించారు. రూ.2 లక్షలు తీసుకుని పాస్‌పోర్టు కూడా వారే సిద్ధం చేయడంతో ఆమె సౌదీ వెళ్లి ఓ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఏడాది తర్వాత అక్కడి ఏజెంట్లు ఆమెను మరో ఇంటికి మార్చారు.

అప్పటినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని భార్య తరచూ ఆమెను చిత్రహింసలకు గురి చేసేది. నాలుగేళ్ల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించిన మల్లిక చివరకు జీవచ్ఛవంలా మారింది. మల్లికను బెంగళూరు ఎయిర్‌ పోర్టుకు బుధవారం పంపుతున్నట్లు సౌదీ నుంచి ఆమె కుటుంబీకులకు మంగళవారం ఫోన్‌ కాల్‌ రావడంతో ఆమె సోదరులు, బంధువులు బుధవారం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఆక్కడ వీల్‌ చైర్లో కన్పించిన మల్లికను చూసి ఖిన్నులయ్యారు. ఆమెను పాస్‌పోర్టు ఆధారంగా గుర్తించాల్సి వచ్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అప్పటికప్పుడు మదనపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు రిఫర్‌ చేశారు. మల్లిక తల్లి రాణెమ్మ, సోదరులు కిశోర్, రాజేష్‌ మాట్లాడుతూ.. మల్లికను ఏజెంట్లు మోసం చేశారని, వారివల్లే ఆమె కష్టాల పాలైందని వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె కోసం నాలుగేళ్లుగా పోలీసులు, ఇతర ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని వాపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top