అంతా ఇద్దరు మంత్రుల కనుసన్నల్లోనే!

Handling of the boats is running in the eyes of two ministers - Sakshi

సాక్షి, అమరావతి: బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా విజయవాడలో మకాం వేసి బోటింగ్‌ వ్యవహారం అంతా తానై వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో 50 శాతం వరకు మంత్రులకు చేరుతోందనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.

ఇందులో భాగంగానే కృష్ణా నదిలో రివర్‌ బోటింగ్‌ క్లబ్‌ పేరిట నడుపుతున్న బోట్లను పర్యాటక సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రివర్‌ బోటింగ్‌ క్లబ్‌ను అధికారికంగా మచిలీపట్నంకు చెందిన ఒక వ్యక్తి పేరిట చూపి తెరవెనుక పర్యాటక సంస్థ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులే నిర్వహిస్తున్నారు. నెల నెలా లక్షలాది రూపాయలు ఆ ఇద్దరి పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయి. కృష్ణా నదిలో ఏ సంస్థకు చెందిన బోట్లు తిరుగుతున్నాయి.... అవి ఎన్ని సార్లు తిరుగుతున్నాయి... ఏ రూట్లో వెళ్లాలనే వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాల్సిన పర్యాటక శాఖ సిబ్బంది ఆ దరిదాపుల్లో కన్పించరు. ప్రమాదానికి కారణమైన రివర్‌ బోటింగ్‌ క్లబ్‌కు చెందిన బోటును తిప్పేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, అసలు ఆ బోటుకు అనుమతి ఉందో లేదో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. అనుమతి ఇవ్వకపోతే ఆ బోటు నదిలోకి ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకం.

సంస్థ అభివృద్ధిపై ఆ శాఖ మంత్రి అఖిల ప్రియ, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వి.జయరామిరెడ్డి పట్టు సాధించకపోవడంతో ఇతర శాఖలకు చెందిన మంత్రుల ప్రమేయం ఎక్కువగా కన్పిస్తోంది. దీని వల్లే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏది చెబితే అది తల ఊపుతూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం వల్లే అమాయకులైనవారు జల సమాధి అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top