హాల్ టికెట్ టెన్షన్ | hall ticket Tension in inter medeate exams | Sakshi
Sakshi News home page

హాల్ టికెట్ టెన్షన్

Feb 28 2016 3:04 AM | Updated on Sep 3 2017 6:33 PM

హాల్ టికెట్ టెన్షన్

హాల్ టికెట్ టెన్షన్

మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొంత మంది విద్యార్థులకు....

 60 శాతం హాజరు లేని ఇంటర్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇవ్వని వైనం
జిల్లాలో 90 మంది
విద్యార్థుల పరిస్థితి
అగమ్యగోచరంఆర్థిక ఇబ్బందులతో
గైర్హాజరయ్యామంటున్న విద్యార్థులు

 
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొంత మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందక పోవడంతో ఆందోళన చెందుతున్నారు.  దాదాపు 76 వేల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కాగా హాజరు శాతం తక్కువగా ఉన్న 90 మందికి హాల్ టిక్కెట్లు ఇవ్వకపోడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలి. వారికే హాల్ టిక్కెట్లను ఇస్తారు. 69-74 శాతం హాజరు ఉంటే రూ. 200, 65-69 శాతం హాజరుకు రూ.250, 60-64 శాతం హాజరుకు రూ. 400 అపరాధ రుసుంతో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తారు. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు. దాదాపుగా ప్రైవేట్ కళాశాలల్లో హాజరు శాతం తక్కువగా ఉన్నా విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఆయా యాజమన్యాలు రూ.2 వేల వరకు వారి నుంచి వసూలు చేసి 60 శాతానికిపైగా హాజరు వేసి ఇబ్బంది లేకుండా చూస్తారు. అయితే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో కచ్చితమైన హాజరు ఉంటుంది. వీరికి హాజరులో ప్రిన్సిపాళ్లు ఎలాంటి మినాహాయింపు  ఇవ్వరు.  
 
 ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ
హాజరు శాతం తక్కువగా ఉన్నా ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం అనుమతి ఇస్తారు. సైన్స్ విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో 60 శాతం హాజరు లేకుంటే అనుమతించరు. ప్రతి ఏటా చివరి సమయంలో ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం రూ. 500 ఫైన్‌తో పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తారు. అయితే ఈ సారి మరో మూడు రోజుల సమయమే ఉన్నా ఆర్ట్స్ విద్యార్థుల అనుమతిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం పరీక్షలకు అనుమతి ఇస్తుందా లేదా అన్న విషయంపై విద్యార్థులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
 
ఉన్నతాధికారులకు నివేదించాం
నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉండాలి. లేకుంటే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వం. అయితే కొన్ని సడలింపులతో 60 శాతం హాజరు ఉన్నా హాల్ టిక్కెట్లు ఇస్తున్నాం. కనీసం 60 శాతం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేందుకు మాకు అధికారంలేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. - పరమేశ్వరరెడ్డి, ఆర్‌ఐఓ
  
 58 శాతం హాజరు ఉంది  
నా పేరు రమేష్. మా ఊరు పర్ల. నేను బీక్యాంపు జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాను. కరువు పరిస్థితుల నేపథ్యంలో కళాశాలకు సక్రమంగా హాజరు కాలేదు. 58 శాతం హాజరు ఉంది. పరీక్ష ఫీజు కట్టాను. ఇప్పుడు పరీక్షలు రాయనీయమంటే ఎలా?   రమేష్, బీక్యాంప్ జూనియర్ కళాశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement